ఖమేనీ కంట్రీపై కన్నెర్ర!

Kannera on Khamenei country!

Feb 18, 2025 - 13:50
 0
ఖమేనీ కంట్రీపై కన్నెర్ర!

ఇజ్రాయెల్​–అమెరికా దాడులకు ప్లాన్​
అణ్వాయుధేతర ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి
ఒప్పుకోకుంటే ఇరాన్​ తో యుద్ధం తప్పదు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు– అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ మధ్య గత ఆదివారం జరిగిన చర్చల్లో ఇరాన్​ పై దాడి అంశం తెరపైకి వచ్చింది. ఈ నిర్ణయం భారత్​ కు ఆశనిపాతంలా పరిణమించే అవకాశం ఉంది. ఇరాన్​ లోని చౌబహార్​ ఓడరేవు ద్వారా భారత్​ పలు దేశాలకు వ్యాపార, వాణిజ్యాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. అంతేగాక పశ్చిమాసియా దేశాల్లో 90 లక్షల మంది భారతీయులపై నేరుగా ప్రభావం పడనుంది. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇరాన్​ అణ్వాయుధాలతో అమెరికాకూ దడ..
నెతన్యాహు–ట్రంప్​ మధ్య ప్రధానంగా ఇరాన్​ అణు కార్యక్రమాన్ని ఆపేయాలని, లేదంటే వారిపై యుద్ధానికి దిగే దిశగా చర్చలు జరిగాయి. ఒకవేళ ఇజ్రాయెల్​ దాడి చేస్తే అమెరికా పూర్తి మద్ధతునిచ్చే అంశాన్ని కూడా ట్రంప్​ బహిరంగంగానే చెప్పారు. వెంటనే ఇరాన్​ ఈ కార్యక్రమాన్ని ఆపివేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదురు కాగలవని హెచ్చరించాడు. దీనర్థం ఒక్కటే ప్రపంచంలో మరో భారీ యుద్ధానికి వీరిద్దరూ కలిసి కారణం కాబోతున్నారు. ఇరాన్​ అనేక ఉగ్రగ్రూపులకు సహాయ సహకారాలందజేస్తుంది. ఇది కూడా ఇజ్రాయెల్​, అమెరికాలకు మింగుడుపడని అంశం. ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్​ లో మార్పు లేకపోవడంతోనే ఇజ్రాయెల్​ గాజా, పాలస్తీనా, లెబనాన్​ లలో దాడులను ఆపడం లేదు. 

అణుస్థావరాలపై దాడులకు సై..
అమెరికాకు అత్యంత దగ్గరి దేశం ఇరాన్​. అయితే 1979లో 52 మంది అమెరికన్లను ఖమేనీ అరెస్టు చేయించారు. అప్పటి నుంచి అమెరికా–ఇరాన్​ లకు పొసగదు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఇరాన్​ అణు సామర్థ్యాన్ని సాధిస్తే అది ఖచ్చితంగా అటు ఇజ్రాయెల్​, ఇటు అమెరికాలకు పెనుముప్పుగా మారనుందనేది ప్రపంచ నిపుణుల అభిప్రాయం. దీంతో ఇరాన్​ ఇక వెనుదిరిగి చూడదని ఆ అణుబాంబులు కాస్త ఉగ్రవాదులకు అందజేసి వారితో దాడులకు పాల్పడేలా ప్రోత్సహించొచ్చని అనుమానాలున్నాయి. ఇందుకే ఇరాన్​ శాస్ర్తవేత్తలు వెంటనే అణు సామర్థ్యాన్ని పెంచుకునే కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని ఇజ్రాయెల్​, అమెరికాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఇరాన్​ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని అంగీకరించాయి. దీంతో ఇరాన్​ అణు సామర్థ్యాలను పెంచుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆయా స్థలాలపై ఇజ్రాయెల్​–అమెరికా సంయుక్తంగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇటు ఇరాన్​ కూడా ఊరుకునే పరిస్థితిల్లో లేదు. ఈ అంశం మరో భారీ యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్​, అమెరికన్లంటే ఇరాన్​ ప్రజలకూ అస్సలు పడదు. 

గాజా వినాశనానికి అమెరికా సహకారం..
పైగా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు ఇరాన్‌ను నాశనం చేస్తామని మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చాక స్వరం మార్చి ఇరాన్​ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనుకుంటున్నామని, అదే సమయంలో అణ్వాయుధాలు లేని దేశంగా ఉండాలన్నారు. దీంతో ట్రంప్​ ఇరాన్​ తో అణుయేతర ఒప్పందం దిశగా సంధి చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. కానీ ఇరాన్​ అందుకు అంగీకరించదన్నది జగమెరిగిన సత్యం. ఇదే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ఆస్కారం ఉంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్​ దాడి సమయంలో కూడా అమెరికా పూర్తి వెన్నుదన్నును అందించింది. భారీ ఎత్తున రహాస్య మార్గాల్లో ఇజ్రాయెల్​ కు ఆయుధాలను తరలించింది. దీంతో ఇజ్రాయెల్​ సుధీర్ఘ యుద్ధంతో గాజా పూర్తి నేలమట్టమైంది. 

భారత్​ పై ప్రభావం..
భారత్​ తన దేశ అవసరాల కోసం 88 శాతం ముడిచమురును పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ ఈ దేశాల మధ్య యుద్ధం తలెత్తితే భారత్​ కు ఇది తీవ్ర విభాగం కలిగిస్తుంది. ముడిచమురు ధరలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. దిగుమతుల ఖర్చులు పెరిగితే ఇది వాణిజ్య లోటును పెంచి డాలర్​ తో పోలిస్తే రూపాయి మరింత దిగజారే ప్రమాదం ఉంది. అయితే ముందే అప్రమత్తమైన మోదీ ప్రభుత్వం క్రమేణా ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ రంగంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుంది. దీంతో 2019లో 17 బిలియన్​ డాలర్ల నుంచి 2023 నాటికి 2.33 బిలియన్​ డాలర్లకు ఇరాన్​ ద్వారా వాణిజ్యాన్ని తగ్గించగలిగింది. అదే సమయంలో ఇంధనం, ఆటోమొబైల్​, విమాన రంగాలు, స్టాక్​ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా 2024లో టెల్​ అవీవ్​ కు విమానాలు రద్దయ్యాయి. ఈ పరిణామం విమానరంగంపై పడింది. మరోవైపు చౌబహార్​ నౌకాశ్రయం కోసం భారత్​ ఇరాన్​ కు 370 మిలియన్​ డాలర్లు అందజేసింది. ఈ ఓడరేవు భారత్​ కు వ్యూహాత్మకంగా నిలవనుంది. ఒకవేళ యుద్ధం తలెత్తితే ఈ ఓడరేవు మూసివేసే అవకాశం ఉంది. దీంతో ఒమన్​ గల్ఫ్​, హార్మూజ్​ జలసంధి, పెర్షియన్స్​ గల్ఫ్​, సూయాజ్​ కాలువ, ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య మార్గాలకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఇది కూడా భారత్​ కు తీవ్ర నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. 

ప్రపంచదేశాలపై ప్రభావం..
మొత్తానికి ఇజ్రాయెల్​–అమెరికా ఇరాన్​ పై కత్తిదూస్తే అది కేవలం భారత్​ కే గాక ప్రపంచదేశాలతోపాటు అమెరికా, ఇజ్రాయెల్​ లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా పశ్చిమాసియాలోని ఇస్లామిక్​ దేశాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతానికి నెతన్యాహు–ట్రంప్​ లు ఇరాన్​ ను బెదిరిస్తున్నా, అది భవిష్యత్​ లో దాడులకు ఆస్కారం ఇచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇరాన్​ కాలుమీద కాలు వేసుకుని కూర్చొనే పరిస్థితుల్లో నైతే లేదు. ఇప్పటికే అనేక ఉగ్రగ్రూపులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందజేస్తున్న ఈ ‘ఖమేనీ కంట్రీ’ కయ్యానికే కాలుదువ్వుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.