కేజ్రీ ఇంటిముందు చెత్తతో మాలివాల్ నిరసన
Maliwal protest with garbage in front of Kejri's house
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఇందుకు కారణం ఆప్ అధినేత కేజ్రీవాలేనని రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. గురువారం కేజ్రీవాల్ ఇంటిముందు మూడుబండ్లతో కూడిన చెత్తను పారబోసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వాతిమాల్ మాట్లాడుతూ.. తాను కేజ్రీవాల్ ను కలిసేందుకే వచ్చానని, తాను ఎవ్వరికీ భయపడనని అన్నారు. ఢిల్లీలోని ప్రతిమూల చెత్తతో నిండిపోయి, మురికి మురికిగా తయారైందన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనాపరిస్థితిలో మార్పు రాకుంటే మరోమారు చెత్తను ఆయన ఇంటిముందు వేసి నిరసనను వ్యక్తం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ రోడ్లన్నీ అధ్వాన్నభరితంగా తయారై మురికి కాలువలు పొంగిపోర్లుతున్నాయని ఆరోపించారు. వికాస్ పూరి ప్రాంతంలో స్వచ్ఛతపై ఎన్నిసార్లు అధికారులకు, ఆప్ నాయకులకు వివరించిన లాభం లేకపోవడంతో మహిళలంతా కలిసి తన వద్దకు వచ్చారని తెలిపారు. వారితోబాటు తాను నిరసనకు ఉపక్రమించానని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఇప్పుడు సామాన్యుడు కాదని, ఆయన నేల గురించి ఆలోచించడం లేదని స్వాతిమాలివాల్ విమర్శించారు. నిరసన చేపడుతున్న మాలివాల్, మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.