ఐక్యతకు నిదర్శనం కుంభమేళా
118వ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహాకుంభ్ మేళా అనేది ఐక్యత, సమానత్వం, సామరస్య సంగమమని, ఈ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 2025 తొలి మన్ కీ బాత్ కార్యక్రమం 118వ ఎపిసోడ్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోనున్నామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైన రోజన్నారు.
మహాకుంభ్ వేల ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయమన్నారు. ఇక్కడ కులవివక్ష, కులతత్వం అనేది లేదన్నారు. ఈ మేళాలో యువత అత్యధికంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. యువతరం దేశ నాగరికతను మరింత బలోపేతం చేయడం అభినందనీయమన్నారు. వారి ఈ విధానం వారి జీవితాల్లో బంగారు బాటలు వేస్తుందన్నారు. దేశ, విదేశాల నుంచి ప్రతి మూల నుంచి ఈ మేళాలు పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారని, కలిసి ప్రసాదాలను స్వీకరిస్తున్నారని అన్నారు. ఇంతకంటే ఐక్యతకు నిదర్శనం ఎక్కడ దొరుకుతుందన్నారు.
దీంతో దేశవిదేశాల్లో భారతీయ మూలాలు మరింత బలపడతాయని తెలిపారు. ఇది యువతరానికి బంగారు భవిష్యత్ ను అందిస్తుందని మోదీ తెలిపారు. అభివృద్ధి పథంలో దేశం పయనిస్తూనే దేశ వారసత్వ సంపద అయోధ్య రామాలయాన్ని కాపాడుకోవడం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో వారసత్వ సంపదలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తయ్యాయని మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానీయులు బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్యామ ప్రసాద్ ముఖర్జీలను గుర్తు చేసుకున్నారు. 1951–52 తొలి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా? లేదా? అనే సందేహం ప్రతి ఒక్కరి మదిలోనూ రేగిందన్నారు. కానీ ఆ సందేహాలు తప్పని ఋజువైందన్నారు. అంత గొప్ప రాజ్యాంగం భారత్ ది అన్నారు. ప్రయాగ్ రాజ్, ఉజ్జయనీ, నాసిక్, హరిద్వార్, దక్షిణ ప్రాంతంలో గోదావరి, కృష్ణా నర్మదా, కావేరీ, తిరుక్కడ్ యూర్, కూడ్ వాస్, తిరుచెరై వరకు అనేక ప్రాంతాల్లో పుష్కరాలు ఐక్యతకు చిహ్నామన్నారు.
ఇస్రో చేపట్టిన డాకింగ్ ప్రకియ విజయవంతం వెనుక బెంగళూరుకు చెందిన పిక్సెల్ కృషి గర్వకారణమన్నారు. ఐఐటీ మద్రాస్ అంతరిక్షంలో ఉత్పత్తి కోసం పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ భారత్ ను సాంకేతికతలోనూ ముందుంచుతున్నాయన్నారు. అసోంలోని ఏనుగుల కోసం అక్కడి ప్రజలు వినూత్న ప్రయత్నంతో వాటి ఆకలి తీరడంతోపాటు పొలాల వైపు ఏనుగులు వచ్చే సమస్యకూ పరిష్కారం లభించిందన్నారు. రెండు నెలల్లోనే దేశంలో కొత్తగా రెండు టైగర్ రిజర్వులు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మన సంస్కృతి, వారసత్వం మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులతో ప్రేమగా జీవించడాన్ని నేర్పుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
స్టార్టప్ ఇండియా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ప్రస్తుతం స్టార్టప్ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా అంబాలా, హిసార్, కాంగ్రా, చెంగల్‌పట్టు, బిలాస్‌పూర్, గ్వాలియర్, వాషిమ్ వంటి నగరాలు స్టార్టప్‌ల హబ్‌గా మారుతున్నాయ సంతోషం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో మానసిక రోగులు, దివ్యాంగులు, వృద్ధులు, మాదకద్రవ్యాలకు బానిసన వారిని దీపక్ నబం సేవ అపూర్వమన్నారు. అలాగే లక్షద్వీప్ లోని కవరత్తి ద్వీపంలో నర్సు హిందుంబీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.