జల్గావ్ రైలు ప్రమాదం 13కు పెరిగిన మృతుల సంఖ్య
Jalgaon train accident death toll rises to 13
పుకార్ల వల్లే ప్రమాదమా? కుట్రకోణమా?
ముంబాయి: జల్గావ్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. గాయపడ్డ వారు 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్పక్ రైలు ప్రమాదంలో ప్రాథమిక దర్యాప్తులో అధికారులకు గురువారం కీలక ఆధారాలు లభించాయి. ప్రత్యక్ష సాక్ష్యులను విచారించిన అధికారులు రైలులో అగ్నిప్రమాదం జరిగినట్లుగా చాయ్ అమ్మే అతను చెప్పాడని, అతనే చైన్ లాగాడని గుర్తించారు. దీంతో రైలు భోగీలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగి ప్రయాణికులు రైలు ఆగకముందే బయటకు దూకేశారు. ఎదురుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు వీరిని ఢీ కొనడంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది. ట్రాక్ లేని వైపు ఎక్కువమంది దూకడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లు గుర్తించారు. ఈ మార్గంలో వంద కిలోమీటర్ల వేగంతో రైలు వెళుతుందని, ట్రాక్ వంకరగా ఉండడం వల్ల నిప్పురవ్వలు ఎగిసిపడుతుంటాయని అంతేగాని అది అగ్నిప్రమాదం కాదని రైల్వే బోర్డు సమాచార, ప్రచార విభాగం ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. అంతేగాక రైలులో అగ్నిప్రమాదం సంభవిస్తే ఆటోమెటిక్ అలారం వ్యవస్థ ఉందన్నారు. అసలు అగ్నిప్రమాదమే జరగలేదన్నారు. ప్రమాదంపై మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు.
కాగా మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ లు సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతులకు మహారాష్ర్ట ప్రభుత్వం రూ. 5 లక్షలు, రైల్వే బోర్డు రూ. 1.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.