ఇండి కూటమి ఉన్నట్టా? లేనట్టా?
శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్
ముంబాయి: ఇండియా బ్లాక్ కూటమి ఉందో లేదో కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. శుక్రవారం రౌత్ మీడియాతో మాట్లాడారు. ఒకసారి కూటమి విచ్ఛిన్నం అయితే అది తిరిగి ఏర్పడదని గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ఉందా? లేదా? అనే సందేహం అన్ని పార్టీలలోనూ ఉందన్నారు. పొత్తు కేవలం లోక్ సభల కోసమే అయితే ఆ విషయాన్ని కాంగ్రెస్ చెబితేనే బాగుంటుందని ఎవరి దారి వారు చూసుకుంటామన్నారు. కూటమి ఒక్కసారి విచ్ఛిన్నం అయితే ముందు ఏర్పడే పరిణామాలు కూడా ఆయా పార్టీల ఆలోచనా రీతిలో, ధోరణిలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించమా? లేదా? అన్న సందేహాలు ఇండి కూటమిలోని అన్ని పార్టీలకు ఉన్నాయని అన్నారు. గత తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూటమి లాగే మహారాష్ర్టలో కూడా ఎంవీఎ మధ్య సమన్వయం లేదన్నారు. ఆప్ నేత కేజ్రీవాల్ ను కాంగ్రెస్ నేతలు దేశవ్యతిరేకి అనడాన్ని తాను ఏకీభవించలేనని సంజయ్ రౌత్ కుండబద్ధలు కొట్టారు.