శాంతికాముక, అభివృద్ధి దేశం భారత్
ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టిస్తాం మన్సూక్ మాండవీయపై ప్రశంసల జల్లు కశ్మీర్ రక్తపాతానికి రాహులే కారణం పుల్వామా, ఉరీ దుశ్చర్యలకు ధీటైన సమాధానం గాంధీనగర్ ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి అమిత్ షా
గాంధీనగర్: దేశంలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శాంతికాముక, అభివృద్ధి దేశంగా భారత్ ముందుకు వెళ్లాలన్నదే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యోద్దేశ్యమన్నారు. అదే సమయంలో దేశంలో ఉన్న ప్రతీ నిరుపేద వరకు తమ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమన్నారు.శనివారం గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో బీజేపీ అభ్యర్థి మన్సూక్ మాండవీయాకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్సూక్ మాండవీయ ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడుచుకుంటారని అన్నారు. ముఖ్యంగా దేశం పట్ల ఆయనకున్న గౌరవం, అభిమానం ఎనలేనిదన్నారు. ఎప్పుడూ అభివృద్ధిలో పయనించాలనే ఆలోచనలను పలుమార్లు తమకు వివరించారని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో రక్తపాతాన్ని పూర్తిగా నివారించగలిగామని తెలిపారు. దీనికి కారణం రాహుల్ గాంధేనని ఆరోపించారు. ఐదేళ్ళలో కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించామన్నారు. ఇప్పుడు కశ్మీర్ ప్రజలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నారని స్పష్టం చేశారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి దేశ ప్రజలు ఆలోచించాలని, ఊహించుకోవాలని సూచించారు.పుల్వామా, ఉరీ దుశ్చర్యలకు ధీటైన సమాధానం ఇవ్వగలిగింది మోదీ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రస్తుతం దేశం ఐదో ఆర్థిక స్థితిలో పటిష్ఠంగా ఉందని, భవిష్యత్తులో మూడో ఆర్థిక స్థితిగా ఎదిగేందుకు పనిచేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో 11వ స్థానంలో ఉండేదన్నారు. ఆర్థిక స్థితి విషయంలో తాను గ్యారంటీ ఇస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే దేశం పటిష్ఠంగా పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు.