10మంది భారతీయ బందీలను రక్షించిన ఐడీఎఫ్
IDF rescues 10 Indian hostages

జేరూసలెం: ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ నుంచి 10 మంది భారతీయ కార్మికులను సురక్షితంగా రక్షించింది. గురువారం అర్థరాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి బందీలను సురక్షితంగా విడిపించి ఇజ్రాయెల్ కు చేర్చారు. వీరిని ఒకనెలపాటు పాలస్తీనియన్లు బంధించారు. పాస్ పోర్టులు లాక్కున్నారు. భారతీయులను పని ఆశచూపి వెస్ట్ బ్యాంక్ కు తీసుకువెళ్లి బందీలుగా చేసుకున్నారు. వీరి ద్వారా స్వాధీనం చేసుకున్న పాస్ పోర్టుల ద్వారా అక్రమంగా ఇజ్రాయెల్ లోకి ప్రవేశించాలని పాలస్తీనియన్లు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఐడీఎఫ్ బందీలను విడిపించే ఆపరేషన్ ను గుట్టుచప్పుడు కాకుండా చేపట్టి విజయం సాధించింది. బందీల విడుదల సమాచారాన్ని ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయానికి అందించింది.
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ పరిస్థితుల్లో తీవ్ర కార్మికుల కొరత ఏర్పడడంతో భారత్ ఒప్పందం ప్రకారం 45వేల మంది కార్మికులకు ఆ దేశానికి పంపింది. అంతకుముందు ఇజ్రాయెల్ లో అనేక రంగాల్లో పాలస్తీనియన్లు పనిచేసేవారు. యుద్ధం తరువాత ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఉద్యోగాల్లో నియమించుకోవడం లేదు. దీంతో భారతీయులకు మంచి డిమాండ్ ఏర్పడింది. అత్యధిక వేతనాలు అందజేస్తూ నివాసం, ఆహారం, వైద్యం తదితర అన్ని రకాల సదుపాయాలనూ కల్పిస్తుంది.