వృద్ధిలో తగ్గేదేలే ఆత్మవిశ్వాసంతో ముందుకు

సీఐఐ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

Jul 30, 2024 - 14:31
 0
వృద్ధిలో తగ్గేదేలే ఆత్మవిశ్వాసంతో ముందుకు
  • మూడో టర్మ్​ లోనే మూడో ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు ప్రయత్నం
  • అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం
  • 2014లో ఆర్థిక వ్యవస్థే పెద్ద ప్రశ్నగా ఉంది
  • దాన్ని సవరించి వృద్ధిని సాధించగలిగాం
  • మారక నిల్వలను పెంచుకున్న ఏకైక దేశం భారత్​ 

    నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అభివృద్ధి కోసం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. ఈ విషయంలో ఎన్నటికీ నా దేశం వెనక్కీ తగ్గదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సీఐఐ (కాన్ఫడరేషన్​ ఆఫ్​ ఇండియా ఇండస్ట్రీ ‘జర్నీ టు డెవలప్డ్ ఇండియా–పోస్ట్-యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్​  కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్​ ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. తన మూడోసారి అధికారంలోనే భారత్​ ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది నిరుపేదలను పేదరికం నుంచి బయటికి తీసుకురాగలిగామని మోదీ పునరుద్ఘాటించారు. దేశాభివృద్ధిలో సీఐఐ పాత్రకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

అభివృద్ధి దిశగా వెళ్లేందుకు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు మాట్లాడి ఎన్నికల తరువాత మరిచిపోయే సంస్కృతి తనది కాదని మోదీ అన్నారు. తామిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే వరకు అలుపెరుగకుండా శ్రమిస్తామని అన్నారు. 2014లో తమ ప్రభుత్వం కొలువయ్యాక ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెట్టాలనేదే పెద్ద ప్రశ్నగా ఉండిందన్నారు. సంక్షోభాలను నుంచి బయటపడేస్తూ వృద్ధిని సాధిస్తూ భారతీయుల కలలను నెరవేర్చగలిగామన్నారు. రూ. 16లక్షల కోట్ల బడ్జెట్​ ను నేడు రూ. 48 లక్షల కోట్లకు తీసుకురాగలిగామన్నారు. నేడు కాపెక్స్​ రూ. 11 లక్షల కోట్లు పెరిగిందన్నారు. కేవలం బడ్జెట్​ పెంచడమే గాకుండా క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును పర్యవేక్షిస్తూనే సుపరిపాలన అందజేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. 

అనిశ్చితి సమయాల్లో కూడా విదేశీ మారకద్రవ్య నిల్వలను వృద్ధి చేసుకున్న ఏకైక దేశం భారత్​ అని అన్నారు. కరోనా లాంటి మహామ్మారిని సైతం ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో ప్రపంచానికి రోల్​ మోడల్​ గా నిలవగలిగామని తెలిపారు. ప్రపంచ వృద్ధిలో నేడు 16 శాతం భారత్​ భాగస్వామ్యం ఉండడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. 

అన్ని రకాల సంక్షోభాలను ఎదుర్కొని పోరాడి ఎదురొడ్డి నిలిచామన్నారు. ప్రస్తుత హయాంలో దేశ ప్రజల జీవన నాణ్యతపై దృష్టి సారించామన్నారు. వారిలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. ముద్ర, స్టార్టప్​ ఇండియా, స్టాండప్​ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా యువతలో నూతనోత్తేజం, చైతన్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బడ్జెట్​ లో ప్రకటించిన ప్యాకేజీతో నాలుగు కోట్ల మంది యువత లబ్ధి పొందుతారని తెలిపారు.

ప్రపంచం ఆర్థిక ఒడిదుడుకులతో సతమతం అవుతున్నా భారత్​ మాత్రం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తుందన్నారు. అదే సమయంలో భారత్​ లోని విదేశీ మారక నిల్వలను కూడా పెంచుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.