ఒత్తిడికి తలొగ్గం
జర్మనీ మ్యూనిచ్ భద్రతా మండలిలో స్పష్టం చేసిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్
మాస్కో: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ప్రస్తుతం కొనసాగుతోందని, భవిష్యత్ లోనూ కొనసాగిస్తామని ఇందులో పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నా వెనక్కు తగ్గబోమని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ స్పష్టం చేశారు. జర్మనీలో జరిగిన జర్మనీ మ్యూనిచ్ భద్రతా మండలిలో ఆదివారం జయశంకర్ మాట్లాడారు. భారత్ చమురు కొనుగోలుకు అనేక మార్గాలున్నాయన్నారు. అందులో ప్రధానమైనది రష్యా అని వివరించారు.
రష్యా, అమెరికాలతో వ్యాపారాల్లో కీలకపాత్ర..
ఓ వైపు రష్యాతో వాణిజ్య, వ్యాపారాలను పెంచుకుంటామని, అదే సమయంలో అమెరికా లాంటి మిత్ర దేశాలతో కూడా వాణిజ్య, వ్యాపారాల్లో ఎగుమతులు, దిగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తామని జై శంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు భారత అభివృద్ధికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను భేషజాలు లేకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వేదికలపై మోదీ వసుదైక కుటుంబం వ్యాఖ్యలతోనే ముందుకు..
రష్యాతో ముడిచమురును కొనుగోలు చేస్తున్న భారత విధానాన్ని పలు దేశాలు విమర్శలు, ఆరోపణలు చేసినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అన్ని దేశాలను కలుపుకొని వెళుతూ అన్ని దేశాలతో సత్సంబంధాలపైనే దృష్టి పెట్టినట్లు, అదే సమయంలో ప్రపంచానికి భారత ప్రధాని సందేశం ‘వసుదైక కుటుంబాన్ని’ గుర్తు చేస్తూ వ్యాపార, వాణిజ్యాలపై ముందుకు వెళతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు రష్యాతో భారత్ బంధాలపై అడపా దడపా జరుగుతున్న అంతర్జాతీయ వేదికలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ భారత్ ధీటుగానే బదులిస్తోంది.
అదే సమయంలో అంతర్జాతీయ ధరల కంటే రష్యా ముడిచమురును భారత్ కు అత్యంత చౌకగా అందిస్తుండడంతో మనదేశం కొనుగోలుకు ఆ దేశం వైపు మొగ్గు చూపుతోంది. ఇదే అంశాన్ని కూడా పలు వేదికలపై భారత్ కుండబద్ధలు కొట్టింది.
మానవాళిని కాపాడుకోవాల్సిన బాధ్యత గాజా–ఇజ్రాయెల్ లదే..
గాజా ఇజ్రాయెల్ ల మధ్య నడుస్తున్న యుద్ధానికి ఎంతోమంది అమాయకులు బలవుతున్నారని జయశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికి కారణం ఉగ్రచర్యలే అని పేర్కొన్నారు. ఇరుదేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభ సమయంలో మానవాళి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరుదేశాలపై ఉందని భారత్ అభిప్రాయపడుతున్నట్లు స్పష్టం చేశారు.
చైనా మంత్రితో భారత్?
మ్యూనిచ్ భద్రతా మండలిలో భారత్ చైనా విదేశాంగ మంత్రులు కలుసుకున్నారు. జయశంకర్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కరచాలనం చేస్తూ పలు విషయాలపై మాట్లాడారు. అయితే వీరివువరి మధ్య ఏం మాటలు కొనసాగాయనేది స్పష్టం కాలేదు.