‘పద్మ’కు రూ. 1 కోటి డిమాండ్​?!

For 'Padma' Rs. 1 crore demand?!

Jan 7, 2025 - 11:48
 0
‘పద్మ’కు రూ. 1 కోటి డిమాండ్​?!

రాజీవ్​ చంద్రశేఖర్​ ఆరోపణ
తాను ఒప్పుకోనందునే చత్వాల్​ కు పురస్కారం
2010లో పురస్కారంపై రాజీవ్​ తీవ్ర ఆరోపణలు
సోరోస్​ కూడా అలాగే దక్కి ఉండొచ్చనే అనుమానాలు?
సామాజిక మాధ్యమంలో పోస్టును పంచుకున్న చంద్రశేఖర్​
అప్పటికే చత్వాల్​ ఆర్థిక నేరాల్లో నిందితుడు?
అయినా పురస్కారానికి ఎంపిక ఎలా చేశారో?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: జార్జ్​ సోరోస్​ అమెరికా అత్యున్నత పురస్కారానికి ఎంపికవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సేవా ముసుగులో మేవా అన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రపంచదేశాల్లో ఆందోళనలు, అవినీతి, మోసాలు, ఉద్రిక్తతలు, ఆయా దేశాల సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించారని ఆయనకు జో బైడెన్​ ప్రభుత్వం పురస్కారాన్ని అందించడం ఖండించాలని టెస్లా అధినేత ఎలన్​ మస్క్​ బహిరంగంగానే తన అక్కసును వెళ్ళగక్కారు. ఇక భారత్​ లో బీజేపీ నేత రాజీవ్​ చంద్రశేఖర్​ ఇదే విషయాన్ని ఉటంకిస్తూ సామాజిక మాధ్యమంలో ఓ ఆసక్తికరమైన పోస్టును చేశారు. ఈ పోస్టులో 2010లో తనకు దక్కాల్సిన భారత అత్యున్నత పురస్కారం పద్మ కోసం తనపేరును ప్రతిపాదించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించి రూ. 1 కోటి లంచం అడిగారన్నది రాజీవ్​ ఆరోపణ. అయితే తాను అందుకు నిరాకరించానని దీంతో యూపీఏ ప్రభుత్వం బ్యాంకు డిఫాల్టర్​ గా ఉన్న సంత్​ సింగ్​ చత్వాల్​ ను ఈ పురస్కారానికి ఎంపిక చేసి, ఆయనకు అందించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజీవ్​ చంద్రశేఖర్​?..


రాజీవ్​ చంద్రశేఖర్​ (బీజేపీ) 2006 నుంచి 2024 వరకు కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కేరళ విభాగానికి జాతీయ అధికార ప్రతినిధిగా, వైస్ చైర్మన్‌గా పనిచేశారు. చంద్రశేఖర్ ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడు, డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2019 పై జాయింట్ కమిటీ సభ్యుడిగా, మంత్రిత్వ శాఖలోని ఎంవోఇ అండ్​ ఐటీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. కమ్యూనికేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ సభ్యుడు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన హయాంలో టెలికాం రంగం అత్యంత అభివృద్ధి చెందినందుకు గాను యూపీఏ హయాంలో రాజీవ్​ ను పద్మ పురస్కారానికి ఎంపిక చేయాలనే డిమాండ్​ ఉంది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఈయన పేరును ప్రతిపాదించింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ తరువాత ఈయనకు పురస్కారం దక్కలేదు.

సంత్​ సింగ్​ చత్వాల్​?..


భారతీయ అమెరికన్​ వ్యాపారవేత్త. ముంబాయి ప్యాలెస్​, హ్యాంప్​ స్పైర్​ హోటల్స్​ అండ్​ రిసార్ట్స్​ అధినేత. ఈయన బిల్​ క్లింటన్​ కు అత్యంత సన్నిహితుడుగా భావిస్తారు. ఆయన పార్టీకి గణనీయంగా విరాళాలందించాడు. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా సహాయం చేశానని కూడా గతంలో ఒప్పుకున్నాడు. ఈ విషయంలో చత్వాల్​ కు సమాజ సేవ లాంటి శిక్ష కూడా విధించారు. రాజీవ్​ చంద్రశేఖర్​ ను కాదని 2010లో పద్మభూషణ్​ పురస్కారాన్ని ఈయనకు అందజేశారు. ఈయనపై రూ. 28 కోట్ల బ్యాంకు మోసం 1992, 94లో కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్ని ఆరోపణలున్నా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈయనకు పద్మపురస్కారం ఇవ్వడం పట్ల రాజీవ్​ చంద్రశేఖర్​ అనుమానం వ్యక్తం చేశారు. అయినా చివరగా చత్వాల్​ కే యూపీఏ ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని కట్టబెట్టింది. దీనిపై అప్పట్లు పలు ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి.