బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు భద్రతా సిబ్బంది మృతి ఆరుగురి పరిస్థితి విషమం
పాట్నా: బిహార్ గోపాల్ గంజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు వెళుతున్న భద్రతా దళాల బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గోపాల్ గంజ్ నుంచి సుపాల్ కు వెళుతున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు సిద్వాలియా పరిధిలో బర్హిమాలో అల్పహారం కోసం ఆపారు. ఇందులో వేగంగా వచ్చిన కంటైనర్ ఆ బస్సులను ఢీ కొంది. దీంతో నలుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్, డీఎం మహ్మద్ మక్సూద్ ఆలంలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందిన, గాయపడిన వారంతా మూడో విడత జరిగే ఎన్నికల నిర్వహణ కోసం సుపాల్ కు వెళుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సిద్వాలియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.