సీఎంపై రైతులు భగ్గు
Farmers are angry with the CM

అరెస్టులతో ఆప్ సీఎంకు పదవి గండం!
చండీగఢ్: రైతుల సమావేశం నుంచి సీఎం భగవంత్ మాన్ వెను దిరగడం (వాకౌట్) చేయడంతో రైతులు భగ్గుమన్నారు. మంగళవారం పెద్ద ఎత్తున రైతులు సీఎం భగవంత్ మాన్ కు వ్యతిరేకంగా పంజాబ్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నిరసనలు, ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు రైతుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తూ రైతులను అరెస్టు చేశారు. దీంతో రాష్ర్టవ్యాప్తంగా రైతులు సీఎం దిష్టిబొమ్మల దహనం చేస్తూ పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. సీఎం రైతు వ్యతిరేక విధానాలపై దుమ్మెత్తిపోశారు. సమావేశం నుంచి వాకౌట్ చేయడమే గాక తమకు అరెస్టు చేయించడాన్ని పలు రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వమేదీ మనుగడ సాగించలేదని స్పష్టం చేశాయి.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఓటమి తరువాత పంజాబ్ లోనూ ఆప్ సీఎంకు ఎదురుపవనాలు వీయడం ప్రారంభించాయి. సోమవారం జరిగిన రైతు సమస్యల పరిష్కార వేదికలో రైతులపై సీఎం భగవంత్ మాన్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తూ సభను వీడి వెళ్లారు. ఇదే అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. రైతు వ్యతిరేక విధానాలపై సీఎం పదవిలో ఇతరులను నియమించాలని కూడా రైతు నిరసనలు, ఆందోళనల్లో వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా అటు ఢిల్లీ ప్రజలతో కేజ్రీవాల్ కు పరాభవం తప్పలేదు, ఇటు రైతులతో భగవంత్ మాన్ కు పదవీ గండం పొంచి ఉందనే వాదనలు వినబడుతున్నాయి.
బీజేపీ గరం గరం..
రైతులను అరెస్టు చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు అరవింద్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు అరెస్టులు అక్రమమన్నారు. సమస్యల పరిష్కార వేదిక నుంచి పారిపోవడం సీఎం చేతకాని తనాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. ప్రభుత్వం వహిస్తున్న తీరుకు రైతులు ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరించారు.