పౌరసత్వం రద్దు ట్రంప్ నిర్ణయంతో ప్రవాసీయుల్లో ఆందోళన
Expats are worried about Trump's decision to revoke citizenship
జో బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు
పౌరసత్వంపై కోర్టును ఆశ్రయించే యోచన
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొలిరోజే జో బైడెన్ నిర్ణయాలను ట్రంప్ జోలపాట పాడి బజ్జోపెట్టారు. బైడెన్ తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ రద్దు చేసి ఝలక్ ఇచ్చారు. అంతేగాక పౌరసత్వం చట్టాన్నీ సైతం రద్దు చేశారు. దీంతో ఎన్నోఏళ్లుగా పౌరసత్వం లభిస్తుందని ఆశిస్తున్న వారికి ట్రంప్ నిర్ణయం శరాఘాతంగానే మారింది. అయితే ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలపై విపక్షాలు కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు.
అమెరికన్ చట్టం ప్రకారం అక్కడ పుట్టిన ప్రతీ ఒక్కరూ అమెరికన్ పౌరుడే. కానీ ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇది వర్తించబోదు. ఈ నిర్ణయం మెక్సికో, కెనడా, భారత్ ను కలవరపెడుతుంది. అమెరికాలో అత్యధికంగా భారతీయులు నివసిస్తున్నారు. హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డుల కోసం లక్షలాది మంది భారతీయులే గాకుండా పలు దేశాలకు చెందిన వారు వేచి చూస్తున్నారు. యూఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం జనన ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేసే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ పుట్టిన ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే 1868లో అమెరికా రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి అక్రమ వలసదారులు, చొరబాట్ల సమస్యను రాజకీయ పార్టీలు నిరంతరం లేవనెత్తుతున్నాయి. ట్రంప్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అధికార పగ్గాలు చేపట్టగానే ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు.
అయితే పౌరసత్వం ఒక వ్యక్తికి లభించాలంటే ఆ వ్యక్తి పుట్టుక అమెరికాలోనే జరగాలి, అంతేగాకుండా అతని తల్లిదండ్రులలో ఎవరో ఒకరు అమెరికన్ పౌరుడిగా ఉండడం తప్పనిసరి. ఒకరికి గ్రీన్ కార్డు ఉండాలి లేదా యూఎస్ ఆర్మీలో పనిచేసి ఉండాలి. దీంతో భారీ ఎత్తున పౌరసత్వంపై ఆశలు పెట్టుకున్న వారికి ట్రంప్ నిర్ణయం శరాఘాతంగా నిలవనుంది. అయితే విదేశాల నుంచి చాలామందే అమెరికాకు వెళ్లి అక్కడ తమ బిడ్డలకు జన్మనీయాలని, పౌరసత్వం లభిస్తుందనే ఆశిస్తారు. ఈ నేపథ్యంలో చాలామందే అమెరికాలో తమ బిడ్డలను కనేందుకు వెళతారు.
భారతీయులపై ప్రభావం..
అయితే గతంలో ఇదే చట్టం ప్రకారం 50వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. ప్రస్తుతం అక్కడ 48 లక్షల పై చిలుకు భారతీయులు నివసిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆదేశం తరువాత ఇదంతా సాధ్యపడదు. దీంతో తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న వారిపై కూడా ఈ ప్రభావం పడనుంది.