కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Ex-Congress MP sentenced to life imprisonment

సిక్కు అల్లర్ల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు
మరణశిక్ష విధించాలని కుటుంబ సభ్యుల డిమాండ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును ప్రకటించారు. ఈ తీర్పు సర్వతి విహార్ లో జరిగిన అల్లర్ల సమయంలో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్యకు సంబంధించినది. అప్పట్లో సజ్జన్ కుమార్ ఢిల్లీ ఔటర్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా బాధితుడి తరఫున కుటుంబ సభ్యులు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఫిబ్రవరి 12న సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్దరించింది. శిక్ష ఖరారు తేదీని వాయిదా వేసింది. అనంతరం 21న శిక్షపై నిర్ణయాన్ని కోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా జీవిత ఖైదు విధిస్తూ అంతిమ తీర్పు వెలువరించింది. ఇప్పటికే సజ్జన్ కుమార్ మరో కేసులో తీమార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
మూడు కేసుల్లో రెండింటిలో దోషి..
ఢిల్లీ కాంట్‌లోని పాలం కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య తర్వాత గురుద్వారాను దహనం చేశారు. ఈ కేసులో సజ్జన్ కుమార్ దోషిగా నిర్దరించారు. 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సుల్తాన్ పురిలో ముగ్గురు సిక్కుల హత్య కేసులో 2023లో రౌస్ అవెన్యూ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. 1984 సరస్వతి విహార్ ఇద్దరు సిక్కుల హత్య కేసులో తాజాగా దోషిగా నిర్దరించి జీవిత ఖైదు శిక్ష విధించింది. మొత్తం మూడింటిలో రెండు కేసుల్లో దోషిగా తేల్చింది. ఒక కేసులో ఆధారాలు, సాక్ష్యాలు లేనందున నిర్దోషిగా ప్రకటించింది.