జగన్నాథ ఆలయంపై డ్రోన్
కఠిన చర్యలు తప్పవన్న మంత్రి హరిచందన్
భువనేశ్వర్: పూరీలోని జగన్నాథ ఆలయంపై అనుమానాస్పద డ్రోన్ కనిపించింది. దీంతో ఆలయ భద్రతకు సంబంధించి భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డ్రోన్ ఆదివారం ఆలయ పరిసరాల్లో కనిపించడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ ఆలయ నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్ లను ఎగురవేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే డ్రోన్ ఎగురవేతపై విచారణ ప్రారంభించామన్నారు. అరగంటపాటు ఆలయంపై డ్రోన్ ఎగిరినట్లు సమాచారం ఉందన్నారు. జగన్నాథ ఆలయం పరిసరాలు నో ఫ్లైయింగ్ జోన్ అని స్పష్టం చేశారు. డ్రోన్ ఎగరడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆలయ ప్రాంగణం చుట్టూ 24 గంటలపాటు వాచ్ టవర్లతో భద్రతను ఏర్పాటు చేసే యోచన ఉందని మంత్రి హరిచందన్ తెలిపారు.