డోనాల్డ్ క్లీన్ బౌల్డ్
ట్రంప్ రేపుతున్న వివాదాలు

అన్నిదేశాలకు బెదిరింపులు
తలలు పట్టుకుంటున్న ప్రపంచదేశాలు
జెలెన్స్కీ ఎదురుదాడితో దిగజారిన పరువు
గతంలోనూ అనేక దేశాలకు హెచ్చరికలు
పరిస్థితులను చక్కదిద్దుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన 38 రోజుల్లోనే ఐదారు దేశాలకు హెచ్చరికలు, బెదిరింపులు జారీ చేశాడు. ఉక్రెయిన్, రష్యా, జోర్డాన్, భారత్, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్, పాలస్తీనా సహా అనేక ఆసియా, యూరోపియన్, మధ్యప్రాచ్యం దేశాలపై విరుచుకుపడ్డారు. వీసాలు, సుంకాలు, ఆయుధాలు, సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న పలుదేశాల అంతర్గత సమస్యల్లోనూ ‘తగుదునమ్మ తానున్నానంటూ’ వ్యవహరిస్తున్నారు. శనివారం జెలెన్స్కీతో చర్చ సందర్భంగా బహిరంగంగానే ‘పిచ్చుక మీద బ్రహ్మస్ర్తం’ ప్రయోగిస్తామనే రీతిలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆ పిచ్చుక కాస్త తగ్గేదేలే అనే సరికి డోనాల్డ్ కాస్త క్లీన్ బౌల్డ్ అయ్యారు. లండన్ కు వెళ్లిన జెలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడి బాబ్బాబూ అంతమంది మీడియా ముందు ప్రపంచ పెద్దన్న పరువు తీయొద్దంటూ బేరసారాలకు దిగారు. దీంతో జెలెన్స్కీ కూడా ఒక మెట్టు దిగి అమెరికా ట్రంప్ ను తలకెత్తుకొని కృతజ్ఞతలు తెలిపాడు. ట్రంప్ దుకూడు వైఖరిని అప్పటికప్పుడే ఖండించిన యూరోపియన్ యూనియన్ 38 దేశాలు ఉక్రెయిన్ కు మద్ధతు ప్రకటించడంతో ఎదురుపవనాలు మరింత గట్టిగా వీయకముందే అప్రమత్తమయ్యారు.
– 2025 జనవరి 20 ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బెంజమిన్ ను ట్రంప్ కలిశాడు. ఈయనతో మిత్రత్వాన్ని పటిష్టం చేసుకుంటూనే ఇస్లామిక్ దేశాలపై బెదిరింపులకు దిగాడు. ఇరాన్ అణు సామర్థ్యం, గాజా, పాలస్తీనా లాంటి దేశాలకు వార్నింగ్ లు ఇచ్చాడు.
– 2025 ఫిబ్రవరి 11న జోర్డాన్ రాజు అబ్దుల్లా ట్రంప్ ను కలిశారు. ఓవల్ సమావేశంలో ట్రంప్ సహనం కోల్పోయి వ్యవహరించారు. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో నివ్వెరపోయిన రాజు అబ్దుల్లా చాకచక్యంతో మీడియాలో తన నోరు తెరవకుండా ‘కర్ర విరగకుండా పామును చంపే’ పద్ధతిని అవలంభించి తప్పించుకున్నాడు.
– 2025 ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రంప్ ను కలిశారు. అక్రమ వలసలు, సుంకాల పోటు విధించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాకచక్యంతో ట్రంప్ తో ఏకీభవిస్తూనే పరిస్థితిని చక్కదిద్ది తన వాణిని సైతం బహిరంగంగానే వినిపించగలిగారు. ట్రంప్ ను పలు విషయాలపై ఒప్పంచి ద్వైపాక్షిక బంధాలను మరింత పటిష్టం చేసుకోగలిగారు.
– ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ 2025 ఫిబ్రవరి 24న ట్రంప్ తో కలిశారు. విలేఖరుల సమావేశంలో మాక్రాన్ తోనూ ఘర్షణ ధోరణిని అవలంబించారు. స్పందించిన మాక్రాన్ వెంటనే ప్రపంచ మీడియా చూస్తుందని ఆయన చేయి పట్టుకొని సంభాషణను ఆపగలిగారు. అమెరికా రుణాలు, హామీలు, గ్రాంట్లు అందించినా అసలు డబ్బులను యూరప్ దేశాలే అందించాయని స్పష్టం చేశారు.
– ఇక అమెరికాకు చిరకాల మిత్రదేశమైన బ్రిటన్ పైనా విమర్శల బాణాలను సంధించారు. 2025 ఫిబ్రవరి 27న ప్రధాని కైర్ స్టార్మర్ ను ట్రంప్ కలిశారు. ఉక్రెయిన్ లో బ్రిటిష్ సైన్యాన్ని మోహరిస్తే అమెరికా వారికి సహాయం చేస్తుందా? అని నిలదీశారు. బ్రిటన్ కు సహాయం అవసరమైతే అమెరికా అందజేస్తుందన్నారు. రష్యాతో ఒంటరిగా బ్రిటన్ పోరాడగలదా? అని సూటిగానే ప్రశ్నిస్తూ ప్రపంచదేశాలను ఏలిన బ్రిటన్ పరువును బజారుకీడ్చారు. దీంతో ‘మింగాలేక కక్కలేక’ అన్నట్లు నవ్వుతూ ప్రధాని కైర్ స్టార్మర్ తప్పించుకున్నాడు.
– ఇక అక్రమవలసలు, డ్రగ్స్, సరిహద్దు విషయాలపై మెక్సికో, కెనడాలపై ఏకంగా కఠిన చర్యలకు ఉపక్రమించారు. సరిహద్దులను పూర్తి పటిష్టం చేశారు. అక్రమవలసదారులను వెనక్కిపంపారు. మెక్సికో, కెనడా సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వీసాల విధానంలో మార్పుచేర్పులు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల విషయంలో కెనడాతో ఖచ్చితత్వంతో వ్యవహరించడం ఇటు భారత్ కు మంచిదే అయినా, మిగతా విషయాల్లో కెనడాను ఇరకాటంలోకి నెట్టారు.