మాజీ సెబీ చీఫ్ మాధవి బుచ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు
ముంబాయి ప్రత్యేక కోర్టు ఆదేశం

నా తెలంగాణ, న్యూఢిల్లీ: సెబీ మాజీ చీఫ్ మాధవి బుచ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ముంబాయిలోని ప్రత్యేక అవినీతి నిరోధక శాఖ కోర్టు ఆదేశించింది. షేర్ మార్కెట్ మోసం, నియంత్రణ ఉల్లంఘన కేసులో మాధవితోపాటు ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఇ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఉన్నతాధికారులపై కూడా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. థానేకు చెందిన జర్నలిస్ట్ ఒకరు ఆర్థిక మోసంపై పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి ఎస్.ఇ. బంగర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెబీ చట్టం కింద ఏసీబీ ఎఫ్ ఐఆర్ నమోదు చేసి 30 రోజుల్లోగా స్టేటల్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. పిటిషన్ దారు తన పిటిషన్ లో పలు ఆరోపణలు సంధించారు. ఒక సంస్థ లిస్టింగ్ లో పెద్ద ఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపించారు.
మాధవి బుచ్ 1989లో ఐసిఐసిఐ బ్యాంక్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె 2007 నుంచి 2009 వరకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2009 నుంచి మే 2011 వరకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్నారు. 2011 లో సింగపూర్ వెళ్లి గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్‌లో పనిచేశారు. ఈమెకు ఆర్థిక రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో సెబీలోని వివిధ హోదాలలో పనిచేశారు. ఆమె ప్రస్తుతం సెబీ సలహా కమిటీలో కూడా ఉండడం విశేషం.