రష్యా–ఉక్రెయిన్​ యుద్ధ విరమణకు బ్లూప్రింట్​ సిద్ధం

Blueprint for Russia-Ukraine ceasefire is ready

Mar 2, 2025 - 18:47
 0
రష్యా–ఉక్రెయిన్​ యుద్ధ విరమణకు బ్లూప్రింట్​ సిద్ధం

అమెరికాకు సమర్పించనున్న ప్రతిపాదనలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్​ యుద్ధ విరమణకు బ్రిటన్​, ఫ్రాన్స్​, ఉక్రెయిన్​ లు కొత్త బ్లూప్రింట్​ తో సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం బ్రిటిష్​ ప్రధానమంత్రి కీర్​ స్టోర్మర్​ కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ బ్లూప్రింట్​ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ కు సమర్పించనున్నట్లు తెలిపాయి. శుక్రవారం వైట్​ హౌస్​ ఓవల్​ లో జరిగిన ట్రంప్​, జెలెన్స్కీ చర్చల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా ఆ తరువాతి పరిణామాల్లో పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ బ్లూప్రింట్​ ఇప్పటికే సిద్ధం అయినట్లు సమాచారం. మరోవైపు జెలెన్స్కీకి యూరప్​ దేశాల భారీ మద్ధతు లభించడంతో అమెరికా కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. దీంతో బ్లూప్రింట్​ ప్రతిపాదనలకు అమెరికాకు పంపనున్నారు. అయితే ప్రతిపాదనలోని అంశాలపై తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రతిపాదనల్లో జెలెన్స్కీ శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బ్లూప్రింట్​ సమర్పణకు ముందు స్టార్మర్​ యూరోపియన్​ శిఖరాగ్ర సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నారు.  ఈ సమావేశంలో ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, రొమేనియా నాయకులు కూడా హాజరవుతారు. టర్కియే విదేశాంగ మంత్రి, నాటో సెక్రటరీ జనరల్, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు కూడా పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.