ఉత్తరాఖండ్ ప్రమాదం.. 8మంది మృతి
రెస్క్యూ చర్యలు నిలిపివేత

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మంచుకొండలు విరిగిపడిన ఘటనలో ఆదివారం ఆపరేషన్ పూర్తయ్యింది. సాయంత్రం వరకు చిక్కుకున్న నలుగురు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారు. 8 మందిలో నలుగురు కార్మికులు కొండచరియల కిందే మృతి చెందగా, మరో నలుగురు చికిత్స సందర్భంగా మృతి చెందినట్లు అధికారులు వివరించారు. 46 మంది కార్మికులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 28)న జరిగిన ప్రమాదంలో 17 మందిని ఆసుపత్రికి తరలించగా, శనివారం రెస్క్యూ చర్యల సందర్భంగా 33 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలోనే నలుగురి ఆరోగ్య పరిస్థితులు విషమించి మృతి చెందారు. ఆదివారం కొనసాగిన రెస్క్యూ చర్యల్లో మరో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. కాగా ఒక కార్మికుడి ఆచూకీ లభించకపోవడంపై ఆరా తీయగా అతను తన గ్రామానికి వెళ్లినట్లుగా అధికారులు ధృవీకరించారు. దీంతో రెస్క్యూ చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.