ఆరుభాషల్లోకి పార్లమెంట్ కార్యకలాపాల వివరాలు
Details of activities of Parliament in six languages

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లోక్ సభలోని కార్యకలాపాల వివరాలు ఇక సంస్కృతం, ఉర్దూతో సహా ఆరు భాషల్లోకి అనువదించనున్నారు. మంగళవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. సంస్కృతం, ఉర్దూ, బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురిల్లోకి అనువదిస్తామన్నారు. ఇప్పటికే సభా కార్యకలాపాల భాషా అనువాదం పది ప్రాంతీయ భాషల్లో కొనసాగుతుందన్నారు. ఏకకాలంలో 22 భాషల్లోకి అనువదించడమే లక్ష్యమని ఓం బిర్లా స్పష్టం చేశారు. మరింతమంది సాంకేతిక సిబ్బంది అందుబాటులోకి రాగానే ఈ చర్యలు చేపడతామన్నారు. ప్రపంచంలోనే పార్లమెంట్ కార్యకలాపాలను అత్యధిక ఎక్కువ భాషల్లో అనువదిస్తున్న దేశంలో భారత్ ముందువరుసలో ఉందన్నారు.
కాగా సంస్కృతభాషలోకి మార్చాలనే నిర్ణయంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో 73వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడతారని అలాంటప్పుడు డబ్బు, సమయం వృథా అవుతుందని వాదించారు. ఈ వాదనను స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు. భారతదేశ మూలభాషే సంస్కృతం అన్నది మరువరాదన్నారు. తాము అన్ని భాషల్లోకి అనువదించే చర్యలను చేపడతామని స్పష్టం చేశారు.