ఢిల్లీ దంగల్​ వార్​ వన్​ సైడే?!

Delhi Dangal War One Sided?!

Jan 7, 2025 - 12:53
 0
ఢిల్లీ దంగల్​ వార్​ వన్​ సైడే?!

ఆ రెంటింటి మధ్యే హోరా హోరీ
బీజేపీ–ఆప్​ మధ్యే ప్రధాన పోటీ
హస్తానికి ఢిల్లీ ప్రజలు బై బై
అవినీతి మరకలతో ఆప్​ సతమతం
పథకాలపైనే కేజ్రీ ఆశలు
ఊపుమీదున్న కమలదళం
ఒక ఏజెండాతో ఎన్నికలకు సై

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ‘ఢిల్లీ దంగల్​’ (ఎన్నికలు) హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది. చెప్పుకునేందుకు మూడు పార్టీలు బీజేపీ, ఆప్​, కాంగ్రెస్​ లుగా భావించినా, హస్తం పార్టీ ప్రభావం పెద్దగా ఎన్నికలపై పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ–ఆప్​ మధ్యే రసవత్తర పోటీ తప్పదంటున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలలో ప్రజలు ఏయే అంశాలను బేరీజు వేసుకొని ఓట్లేస్తారని ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టతరమైనా కొన్ని అంశాలను మాత్రం తప్పక గమనించాల్సిందే. ఈ అంశాలను గమనిస్తే వార్​ వన్​ సైడ్​ గా భావించొచ్చు. ఆయా సీట్లలో బీజేపీ, ఆప్​, కాంగ్రెస్​  పార్టీలకు చెందిన పెద్ద నేతలు కూడా ముఖాముఖి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు మరింత హీట్​ పుట్టించనున్నాయి. ఎన్నికల తేదీని మంగళవారం మధ్యాహ్నం ఈసీ ప్రకటించనుంది. దీంతో పార్టీలు తమ తమ ప్రచారాలకు అస్ర్త శస్ర్తాలతో సిద్ధంగా ఉన్నాయి. 

హస్తం రెండు నాల్కల ధోరణి..
2013, 2015, 2020 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రీక్​ సాధించిన ఆప్​ పార్టీ నాలుగో‘స్సారీ’ అంటుందా? లేక అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్​ స్వీప్​ చేసింది. ఎక్కడా ఆప్​, కాంగ్రెస్​ పార్టీల జాడ కనిపించలేదు. అదే ఊపుమీదున్న కమలదళం మరిన్ని అడుగులు వేస్తూ ఢిల్లీ పీఠాన్ని తమ వశం చేసుకోవాలని కోరుకుంటుంది. ఇక అంతిమంగా హస్తం పార్టీ ఇండి కూటమితో పలు పార్టీలను జతకడుతూ గత ఎంపీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్నే చవిచూసింది. పార్టీ రెండు నాల్కల ధోరణిని అనేక రాష్ర్టాల ప్రజలు తిరస్కరించారు. పార్టీ సొంతంగా వంద సీట్లు కూడా సాధించుకోలేక చతికిలపడింది. హిందువులపై అన్యాయాల అంశం హస్తం పార్టీకి సవాల్​ విసురుతోంది. బంగ్లా అల్లర్ల విషయంలో ఇప్పటివరకూ ఈ పార్టీ సరైన స్ర్టాటజీతో లేదు. తూతూ మమ అన్నట్లుగా ఉంటుంది. అదే సమయంలో దేశ సున్నిత అంశాలపై పార్లమెంట్​ లో ఆందోళనలు, ప్రకటనలు చేస్తూ తనకున్న కాస్త ఇమేజ్​ ను పోగొట్టుకునేలా చేసుకుంది. దీంతో ఢిల్లీ ప్రజలు ఈపార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఉంటే గింటే బీజేపీ–ఆప్​ మధ్య ప్రధాన పోటీ ఉండేలా కనిపిస్తున్నా, ఆప్​ పార్టీ అన్నాహజారే విధానాలకు తిలోదకాలిచ్చి అవినీతి కూపంలో కూరుకుపోయి ప్రజలకు తాయిలాలను ప్రకటిస్తుండడంపైనే ఆశలు పెట్టుకుంది. మరీ వీటిని ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారనేది భవిష్యత్​ లో తెలుస్తుంది. 

ఆప్​ అవినీతి మరకలు..
మనీలాండరింగ్​, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సాక్షాత్తూ మాజీ సీఎం, ఆప్​ అధినేత జైలుకు వెళ్లివచ్చారు. ఆప్​ పార్టీ నేతలు కూడా ఊచలు లెక్కపెట్టారు. తొలిసారి అధికారంలోకి రాకముందే యమునా ప్రక్షాళన చేపడతామన్నారు. 12యేళ్లు గడిచినా నేటికి అతీగతీ లేదు. తాజాగా ఢిల్లీ బయట నుంచి నీటిని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అంటే యమునా ప్రక్షాళన కథ కంచికి చేరినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. ఇక కేజ్రీవాల్​ శీష్​ మహల్​ నిర్మాణానికి రూ. 75 నుంచి రూ. 80 కోట్లు ఖర్చయ్యాయనే ఆరోపణలున్నాయి. ఈ ఇంటినిర్మాణంలో ప్రజాధనం భారీగా వృథా చేశారనే ఆరోపణలున్నాయి. ఆరోపణలకు తగ్గట్లుగానే ఈ ఇంట్లో సౌకర్యాలు అత్యంత ఖరీదైనవిగా ఉండడం ఆశ్చర్యకరం. దీంతో కేజ్రీవాల్​ ప్రతిష్ఠ మరింత మసకబారిందనే చెప్పాలి.

పథకాల అమలులో చేతులెత్తేయడం ఖాయం..
24 గంటలు త్రాగునీరు, 18 నిండిన మహిళలకు రూ. 1000 ని రూ. 2100కి పెంచడం, విద్య, వైద్యం తదితర అలవికాని హామీలను కేజ్రీవాల్​ భారీగానే ఇచ్చారు. కానీ ఇందుకయ్యే ఖర్చంతా ఎటునుంచి, ఎలా తెస్తారనేది ప్రణాళికను మాత్రం ప్రజలకు వివరించి, అర్థమయ్యేలా చెప్పడం లేదు. ఇవన్నీ ఉత్త ట్రాష్​ మాటలేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో ఆర్థిక వేత్తలు కేజ్రీవాల్​ హామీలతో ఢిల్లీ ఖజానాకు భారం తప్పదంటున్నాయి. లేదా అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయలేక పంజాబ్​ లోలా చేతులెత్తాస్తారా? అని బీజేపీ, కాంగ్రెస్​ నేతలు బహిరంగంగానే ఆప్​ ను నిలదీస్తున్నారు. దీనిపై స్పష్టమైన విధానం, సమాధానం ఆప్​ పార్టీ వద్ద లేదు.

దిగ్గజాల పోటీ..
అరవింద్​ కేజ్రీవాల్​ (ఆప్​), సందీప్​ దీక్షిత్​ (కాంగ్రెస్​–షీలా దీక్షిత్​ కుమారుడు), అతిషి (ఆప్​), అల్కా లాంబా (కాంగ్రెస్​), ప్రవేశ్​ వర్మ (బీజేపీ), రమేష్​ బిధూరి (బీజేపీ), మనీష్​ సిసోడియా (ఆప్​) లాంటి దిగ్గజ నేతలు ముఖాముఖి తలపడనున్నారు.