దేశానికి స్ఫూర్తినిచ్చిన వీర్​ బల్​ దివస్​

ప్రధాని నరేంద్ర మోదీ హర్షం

Dec 26, 2024 - 16:21
 0
దేశానికి స్ఫూర్తినిచ్చిన వీర్​ బల్​ దివస్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వీర్​ బల్​ దివస్​ దేశానికి స్ఫూర్తినిచ్చే పర్వదినంగా మారడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వీర్​ బల్​ దివస్​ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనారు. గురుగోవింద్​ సింగ్​ ఆయన ఇద్దరు కుమారులు జోరావర్​ సింగ్​, ఫతేసింగ్​ లకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ బాలల అవార్డు గ్రహీతలతో సంభాషించారు. 

భారతీయుల్లో అసామాన్య ధైర్య సాహసాలు, విశ్వాసాలు కలిగించారని కొనియాడారు. మొఘలులకు వ్యతిరేకంగా వీరి పోరాటం అసామాన్యమైనదన్నారు. చిన్నవయసుల్లోనే వీరి త్యాగం దేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి సిక్కు గురువుల బోధనలు ధైర్యాన్ని, సమానత్వాన్ని, సంక్షేమాన్ని బోధించాయన్నారు. భారత యువత వారి అడుగుజాడల్లో నడవాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. దేశ సమగ్రత, ఆలోచనలతో ఎప్పుడూ రాజీపడవద్దని, దేశ రాజ్యాంగం సార్వభౌమాధికారం, సమగ్రత అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. 

స్టార్టప్‌లు, సైన్స్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వరకు యువశక్తి కొత్త విప్లవాన్ని తీసుకువస్తోందని మోదీ అన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆవిష్​కరణ యుగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు ఇనుమడిస్తేనే దేశాభివృద్ధి మరింత సాధ్యమన్నారు. యువత ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వినూత్న అభివృద్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని తమలోని గుణగణాలను మెరుగుపరుచుకొని ఆవిష్కరణ కోణాలను వెలికితీయాలన్నారు.