సంగమ స్నానం చేస్తే సద్భుద్ది
Confluence bathing is good
అఖిలేష్ కు బీజేపీ నేత నఖ్వీ చురకలు
లక్నో: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మహాకుంభ్ లో సంగమ స్నానం చేస్తే ఆయనకు మంచి బుద్ధి కలుగుతుందని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చురకలంటించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళా పనులపై అఖిలేష్ చేసిన ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మహా కుంభమేళాపై దృష్టి ఉందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో సకాలంలో పనులు పూర్తవుతాయన్నారు. పనులు పూర్తయ్యాక సంగమ స్నానం చేయాలని అఖిలేష్ కు చురకలంటించారు. ప్రయాగ్ రాజ్ లో సకాలంలో పనులు పూర్తి చేసేందుకు బలమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో భయాలను సృష్టించాలని కోరుకుంటున్నారన్నారు. సంగమ స్నానం ఆచరిస్తే ప్రతికూలతలు, భయాందోళనలు ముందుగా వారిలోనే కొట్టుకుపోతాయని నఖ్వీ విమర్శించారు. ప్రతి మత స్థలం క్రింద ఒక ఆలయం కనిపించడం పరస్పర సామరస్యాన్ని, సద్భావనను పాడు చేస్తుందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. కొందరు విదేశీ ఆక్రమణదారుల వల్ల దేశంలోని మతాలు, కులాల్లో మతసామరస్యం దెబ్బతిందన్నారు. ఎట్టకేలకు అయోధ్యకు పరిష్కారం లభించడం సంతోషదాయకమన్నారు. వివాదాస్పద విషయాల్లో శాంతి చర్చల ద్వారానే పరిష్కార మార్గం లభిస్తుందని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు.