కుప్పకూలిన మిరాజ్–2000
ఇద్దరు పైలెట్లకు గాయాలు

భోపాల్: మధ్యప్రదేశ్ లోని శివపురిలో వైమానిక దళ యుద్ధ విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం బహ్రెటా గ్రామానికి సమీపంలో మిరాజ్–2000 యుద్ధవిమానం కూలింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రమాదానికి ముందే స్వల్పగాయాలతో బయటపడ్డారు. గ్వాలియర్ శిక్షణ ప్రాంతం నుంచి వైమానిక దళానికి చెందిన మూడు యుద్ధ విమానాలు బయలుదేరగా రెండు సురక్షితంగా తిరిగి వచ్చాయి. మిరాజ్–2000 సాంకేతిక సమస్య వల్ల ప్రమాదానికి గురైంది. గాయాలైన పైలెట్లను గ్వాలియర్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విమానం కూలిపోయేందుకు గల కారణాలను అన్వేషిస్తుంది.
స్థానిక ఎస్పీ సంజీవ్ ములే..
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గ్రామస్తులు విమాన ప్రమాదం గురించి సమాచారం అందించారు. వెంటనే తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని విమానంలో చెలరేగుతున్న మంటలను ఆర్పాము. గాయపడిన పైలెట్లను చికిత్స నిమిత్తం గ్వాలియర్ కు తరలించాము. ప్రమాద విషయంపై గ్వాలియర్ వైమానిక దళ ఉన్నతాధికారులతో సమాచారాన్ని పంచుకున్నాం. విమానం పొలాల్లో కూలడంతో పెను ప్రమాదం తప్పింది.