మధ్యాహ్నం సిటీబస్సులు బంద్
నేటి నుంచే అమలుకు టీఎస్ ఆర్టీసీ నిర్ణయం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 దాకా అవసరాన్ని బట్టి సర్వీసులు మండే ఎండల దృష్ట్యా మధ్యాహ్నం వేళ భారీగా తగ్గిన ప్రయాణికులు ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని మనవి
నా తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం వేళ కాలు తీసి బయటకు పెట్టాలంటేనే వేడి గాలులకు వణికిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో బస్సుల్లో కూడా ప్రయాణికులు పెద్దగా ఎక్కడం లేదు. ఎండల వేడిమిని తట్టుకోలేక ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తక్కువ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఇక ఉదయం, సాయంత్రం వేళలో ప్రయాణికులకు సరిపడా బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. మధ్యాహ్నం వేళ ప్రయాణం చేసే వారు ఆర్టీసీ నిర్ణయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.