ప్రముఖుల ఓట్లు–1 ప్రతీ ఓటు కీలకమే: ప్రధాని మోదీ
Celebrity Votes – 1 Every Vote Matters: PM Modi
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆరోదశ ఎన్నికల సందర్భంగా శనివారం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేస్తూ అత్యధిక సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు, యువత ప్రతీఒక్కరూ ఓటేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
బాన్సురి స్వరాజ్..
వికసిత భారత్ కోసం ప్రతీ ఒక్కరూ ఓటేయాలని ఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయమే ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశం సుభిక్షంగా, భద్రతగా, అభివృద్ధి దిశలో కొనసాగేందుకే ప్రతీఒక్కరి సహకారం ముఖ్యమన్నారు. ఆ దిశలో తమ ఓటుశక్తిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటేసేముందు బాన్సూరి ఢిల్లీలోని దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..
తమకు ఇప్పటికే విజయానికి కావాల్సిన సీట్లు దక్కాయని కేంద్రంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో తన సతీమణితో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 303 సీట్లు సాధించామన్నారు. మరో రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తమ లక్ష్యం 400 సీట్లను దాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ విజయం సునాయాసమేనని ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మనోహర్ లాల్ ఖట్టర్..
హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ లో ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు బయటికి వెళ్లి ఓటేయాలన్నారు. దేశాభివృద్ధికి ప్రతీ ఓటు కీలకమన్న విషయం మరవరాదన్నారు. బీజేపీ విషయానికి వస్తే పదికి పది సీట్లు గెలువబోతున్నామని తెలిపారు. హరియాణా ప్రజలు ఈసారి వినూత్న తీర్పు ఇవ్వనున్నారని తెలిపారు. ఆప్, కాంగ్రెస్ లను హరియాణా ప్రజలు నమ్మబోరన్నారు. హరియాణా అభివృద్ధికి ప్రజలు, ప్రధాని తమ నేతృత్వంలో ముందుకు వెళతామన్నారు. ఇందుకు అందరూ సహకరించాలన్నారు.
జై శంకర్..
ప్రజాస్వామ్య తీర్పునకు అతిపెద్ద రోజని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశాభివృద్ధికి ఓటు కీలకమన్నారు. ఢిల్లీలో జై శంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.