ఆరోగ్యంగానే సీఎం కేజ్రీవాల్
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన ఐదుగురు ఎయిమ్స్ వైద్యుల బృందం
తీహార్: తీహార్ జైలులో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ ఐదుగురు వైద్య బృందం స్పష్టం చేసింది. ఇన్సులిన్ క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించింది. ఆయన ఆరోగ్యం, అన్నపానీయాలపై కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం శనివారం తీహార్ జైలులో కేజ్రీవాల్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. మందులు తీసుకునే విషయంలో ఎలాంటి మార్పును వైద్యబృందం సూచించలేదు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అరగంటపాటు కొనసాగగా ఇందులో జైలుకు చెందిన ఇద్దరు వైద్యుల బృందం కూడా పాల్గొంది. వారం మొదటిలో కేజ్రీవాల్ షుగర్ లెవెల్ 320కు చేరుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ కోర్టు సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు సూచించింది. దీంతో వైద్య బృందం కేజ్రీ ఆరోగ్యంపై ఆరా తీసింది. విషయాలను కోర్టుకు నివేదిక రూపంలో ఈ బృందం వెల్లడించనుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రతిరోజూ తన వైద్యుడిని సంప్రదించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు గత వారం తిరస్కరించింది. అయితే, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆప్ అధినేతకు ఇన్సులిన్ అవసరమా లేదా అనేది నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.