బీఎస్పీ ఇద్దరు జాతీయ సమన్వయకర్తల నియామకం
ఆకాష్ ఆనంద్ తొలగింపు

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఆదివారం లక్నోలో జరిగిన జాతీయ సమావేశంలో ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆకాష్ ఆనంద్‌ను కూడా పిలిచారు, కానీ ఆయన కినుక వహించినట్లు సమాచారం. మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్, రాంజీ గౌతమ్ లను కొత్త జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు. లక్నోలో జరిగిన బీఎస్పీ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌తో సహా అఖిల భారత స్థాయి పార్టీ పెద్ద, చిన్న అధికారులందరూ పాల్గొన్నారు. సమావేశంలో, వివిధ స్థాయిలలో పార్టీ సంస్థను సిద్ధం చేయాలని, క్యాడర్ ఆధారంగా సమాజంలో మద్దతు పెంచాలని, ప్రతి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మాయావతి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదేశించారు. నాలుగేళ్లుగా ఆకాష్ ఆనంద్ పార్టీకి సేవలందిస్తున్నా బీఎస్పీలో ఎలాంటి పదవ దక్కలేదు. మాయావతి ఆకాష్ ఆనంద్ కు సంస్థాగత శిక్షణ ఇచ్చి జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. దీంతో సంస్థాగత మార్పు చేర్పులు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.