బంగ్లా మైనార్టీలపై దాడులు
Attacks on Bangla Minorities

బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి నివేదిక
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లలో 32 మంది హిందువులు హత్యకు గురి కాగా, 13 మందిపై లైంగికదాడులు, 133 దేవాలయాలు ధ్వంసమైనట్లు మైనార్టీ సంస్థ నివేదికలో వెల్లడైంది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి. దీంతో పలు విధ్వంసకర ముఠాలు, ఉగ్ర గ్రూపులు మైనార్టీలను టార్గెట్ గా చేసుకున్నారు. ఐదు నెలలపాటు మైనార్టీలపై వీరి విధ్వంసకాండ కొనసాగింది. 2010 తరువాత ఇంతపెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం 2024లోనే జరిగింది. 2010లో జరిగిన అల్లర్లలో 1769 కేసులు నమోదయ్యాయి. 2024 నుంచి 2025 జనవరి 11 వరకు 1415 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 10 నాటికి మైనార్టీలపై దాడుల కేసుల్లో 70 మందిని అరెస్టు చేశారు. కేసులు, నష్టపరిహారాలకు సంబంధించిన విషయాలను కూడా బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి చూసుకుంటుంది. నష్టపోయిన బాధితులకు పూర్తి అండగా నిలుస్తుంది.
తొలుత 15 రోజుల్లో జరిగిన దాడులు..
9 హత్యలు, 69 దేవాలయాలు ధ్వంసం, నాలుగు లైంగికదాడులు, 915 ఇళ్లపై దాడులు, 953 దుకాణాలు ధ్వంసం, ఒక ఇంటిని పూర్తిగా తగులబెట్టారు, మైనార్టీలపై 38 దాడులు జరిగాయి.
ఆగస్ట్ 20 తరువాత నాలుగు నెలల్లో దాడులు..
23 హత్యలు, 9 సామూహిక లైంగికదాడులు, 64 ప్రార్థనాలయాలు ధ్వంసం, 15 మంది మైనార్టీల అరెస్ట్ చేసి హింసకు గురి చేశారు. 38 మైనార్టీల దుకాణాలు ధ్వంసం చేశారు. 25 ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలను కబ్జా చేశారు. మొత్తం 174 ఘటనలు జరగ్గా ప్రభుత్వం 9 కేసులు మాత్రమే నమోదు చేసింది.
బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి బంగ్లాదేశ్ లోని అల్లర్లు జరిగిన ఠాకూర్ గావ్, లాల్ మోనిహార్ హట్, దినాజ్ పర్, రంగ్ పూర్, సిల్హాట్, కుల్నా ప్రాంతాల్లో సర్వే జరిపి నివేదికను వెల్లడించింది. కాగా 2024లో మొత్తం భద్రతా దళాలు, దాడుల కారణంగా దేశవ్యాప్తంగా 1400మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితికి భారత్ తెలిపింది.