మమత పాలనలో అరాచకం

ఎక్కడపడితే అక్కడే ఆయుధాలు, బాంబులు సందేశ్​ ఖాళీపై పరదా వేస్తారా? 35 స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా

Apr 28, 2024 - 16:05
 0
మమత పాలనలో అరాచకం

కోల్​ కతా: మమత పాలనలో రాష్ర్టంలో బాంబులు, పిస్టళ్లు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా అన్నారు. టీఎంసీ (తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ) అధినేత్రి పాలనలో అసాంఘిక కార్యకలాపాలు, విద్రోహశక్తులకు ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఆదివారం జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్​ లో పర్యటించారు.

సందేశ్​ ఖాళీ ఘటన దేశం నివ్వెరపోయేదని వాపోయారు. మమత క్రూరత్వం ఇంతా అంతా కాదని దుయ్యబట్టారు. అక్కడ మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలపై టీఎంసీ పరదా వేయాలని చూసిందని మండిపడ్డారు. మమత పాలనను గమనిస్తున్న రాష్ర్ట ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆమెకు బుద్ధి చెబుతారని నడ్డా పేర్కొన్నారు. 35 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సందేశ్​ ఖాళీలో ఎన్​ఎస్​జీ కమాండోలు, బాంబుస్క్వాడ్​ లు రంగంలోకి దిగితే గానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఢొంక కదలలేదన్నారు. బీజేపీ మహిళా బాధితురాలికి టిక్కెట్​ కేటాయిస్తే టీఎంసీ ఓర్వజాలడం లేదని మండిపడ్డారు. తమ పార్టీ నేతృత్వంలో, మోదీ జమానాలో మహిళలు ఒంటరివారు కాదన్న గుర్తెరగాలని తెలిపారు. దర్యాప్తు కోసం వెళ్లిన అధికారులపై టీఎంసీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడడం వారి రౌడీయిజానికి నిదర్శనమన్నారు. 

సందేశ్​ ఖాళీలో ఆయుధాలు లభించడం, బాంబులు లభించడం ప్రజలు కళ్లారా చూశారని వివరించారు. ప్రజలను భయపెడుతూ మమత ఇన్ని రోజులు అరాచక పాలనను నడిపారని మండిపడ్డారు. బెంగాల్​ మహనీయులు నేతాజీ, ఠాగూర్​, వివేకానంద, అరబిందో లాంటి వారి పేర్లను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. 

షేక్​ షాజహాన్​ లాంటి సంఘ విద్రోహ శక్తులతో కలిసి దేశంలో వలసలను ప్రోత్సహిస్తూ వారి ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు మమతా బెనర్జీ తెరలేపారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.