అరుదైన శస్త్రచికిత్సలో ఎయిమ్స్ వైద్యులు విజయవంతం
AIIMS doctors are successful in rare surgery

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పొట్టభాగంలో రెండు కాళ్లతో బతుకీడుస్తున్న బాలునికి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి కాళ్లను తొలగించారు. ఈ శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనదిగా వైద్యులు తెలిపారు. బుధవారం ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేశారు. అరుదైన జన్యుపరం లోపం కారణంగా ఈ బాలుడికి పుట్టుకతోనే కడుపు భాగంలో రెండు కాళ్లు వచ్చాయి. యూపీకి చెందిన 17 ఏళ్ల బాలుడిని పరీక్షించిన ఎయిమ్స్ సర్జరీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ అసూరి కృష్ణ శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా ఆ భాగాన్ని తొలగించగలిగారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులో 42 మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఈ లోపం కారణంగా బాలుడిలో ఎదుగుదల లోపం ఏర్పడిందన్నారు. భవిష్యత్ లో ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ బాలుడు 8వ తరగతి విద్యనభ్యసిస్తూ తోటి బాలల చేత ఎగతాళికి గురై చదువు కూడా మధ్యలోనే ఆపివేశాడన్నారు. కుటుంబీకులు న్యూ ఢిల్లీలోని ప్రిమియర్ ఆసుపత్రిని సంప్రదించారని తెలిపారు. ఆసుపత్రి వర్గాలు తమను సంప్రదించాయని బాలునికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స ద్వారా లోపాన్ని నివారించవచ్చని గుర్తించామని డా. అసూరి కృష్ణ తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం కావడం అరుదైనదని పేర్కొన్నారు.