మహాకుంభమేళా@67 కోట్లు!

  ప్రపంచ రికార్డులూ బద్ధలే!

Feb 26, 2025 - 18:41
 0
మహాకుంభమేళా@67 కోట్లు!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: మహా కుంభమేళాకు ప్రపంచంలో ఏ ఆధ్యాత్మికత పర్వదినం రోజున రానంత మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్త రికార్డులు నమోదయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం, ఆఖరి రోజు కావడంతో ఉదయం 10 గంటల వరకే 90 లక్షల మంది త్రివేని సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించగా, సాయంత్రం 4 గంటల వరకు ఆ సంఖ్య 1.5 కోట్లకు చేరుకుంది. 67 కోట్లకు పైగా పుణ్య స్నానాల రికార్డును కూడా సొంతం చేసుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 65 కోట్ల రికార్డు గిన్నిస్​ బుక్​ లో నమోదైంది. దీంతోపాటు మరో మూడు రికార్డులు కూడా నమోదయ్యాయి. కాగా బుధవారం ఆఖరి రోజు కావడంతో వైమానిక దళం ఎయిర్​ షో నిర్వహించింది. భక్తులపై పూలవర్షం కురిపించారు. ఉదయం నాలుగు గంటల నుంచే సీఎం యోగి ఆదిత్యనాథ్​ భక్తుల ఏర్పాట్లను కంట్రోల్​ రూమ్​ ద్వారా పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. 

తేదీల వారీగా..
– 13 జనవరి 1.70 కోట్లు, 14 జనవరి 3.50 కోట్లు, 29 జనవరి 7.64 కోట్లు, 03 ఫిబ్రవరి 2.57 కోట్లు, 12 ఫిబ్రవరి 2 కోట్లు, 26 ఫిబ్రవరి సాయంత్రం 4 గంటల వరకు 1.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలాచరించారు.

ప్రత్యేకతలు.. రికార్డులు..
– భారత జనాభా 146 కోట్లు, చైనా జనాభా 142 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు, పాకిస్థాన్​ జనాభా 24 కోట్లు, రష్యా జనాభా 14 కోట్లు కాగా మహాకుంభమేళాలో పాల్గొన్న భక్తుల సంఖ్య 64 కోట్లు.

2019లో 24 కోట్లమంది..
–  తొలుత 45 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని యూపీ ప్రభుత్వం భావించింది. కానీ వారి లెక్కలు తప్పాయి. 65 కోట్ల మార్క్​ ను బుధవారం ఉదయమే దాటింది. రాత్రి వరకూ మరో మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే ఆస్కారం ఉందని ఈ సంఖ్య 70 కోట్లకు చేరుకున్నా ఆశ్చర్య పోనవరం లేదని లక్నో డీజీపీ తెలిపారు. 2019లో కుంభమేళాలో 24 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రస్తుతం రోజువారీగా తీసుకుంటే రోజుకు 1.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 10 లక్షల మంది నాగాలు, సాధు సంతువులు పుణ్య స్నానాలాచరించారు. 

ప్రముఖుల పుణ్య స్నానాలు..
– రాష్​ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్​ రాజు నరేష్​ జిగ్మే ఖేసర్​, నేపాల్​ మాజీ పీఎం షేర్​ బహదూర్​, 73 దేశాల విదేశాంగ శాఖల అధికారులు, భక్తులు 50 లక్షల మంది దర్శనాలు చేసుకున్నారు. మహాకుంభంలో బుధవారం ఉదయం వరకు 400 మంది వీవీఐపీలు పుణ్య స్నానాలాచరించారు.

4000 హెక్టార్లలో నిర్వహణ..
– నాలుగు వేల హెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని అత్యంత పెద్దదైన స్టేడియం (నరేంద్ర మోదీ స్టేడియం–అహ్మాదాబాద్​ 25హెక్టార్లు) కంటే 160 రెట్లు ఎక్కువ స్థలాన్ని మేళా నిర్వహణకు ఉపయోగించారు. 2019లో 3200 హెక్టార్లలో ఏర్పాటు చేశారు. 20 విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం 42 ఘాట్లను పుణ్య స్నానాలకు ఏర్పాటు చేశారు. 30 తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేశారు. 

4500 టన్నుల ఇనుముతో బ్రిడ్జి నిర్మాణం..
– రోడ్డు కోసం 651 కి.మీ. మేర ఉపయోగించే ఇనుమును వాడారు. రెండు హైవేలు, 200 కొత్త రోడ్ల నిర్మాణానికి ఇంతపెద్ద ఎత్తున ఇనుమును వాడారు. 4500 టన్నులతో బెలా–కచార్​ లో ఒక బ్రిడ్జినే రూపొందించారు. 

1532 కి.మీ. పొడవు విద్యుత్​ కేబుల్​..
– నాలుగు లక్షల టెంట్లు, 1.5 లక్షల టాయ్​ లెట్లు, సాధు సంతువుల కోసం 85 సామూహిక టెంట్లు, 50 ఆశ్రమాలను కేటాయించారు. బాబాల కోసం 500 ప్రత్యేక టెంట్లను సిద్ధం చేశారు. మేళా ప్రాంతంలో వీఐపీల కోసం 1500 సింగిల్​ రూమ్​ లు, 400 కుటుంబాలకు టెంట్లను సిద్ధం చేశారు. 1.5 లక్షల టాయ్​ లెట్లలో 300 మొబైల్​ టాయ్​ లెట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్​ కోసం 1532 కి.మీ. పొడవు కేబుల్​ ను ఏర్పాటు చేశారు. 4.71 లక్షల కనెక్షన్లను ఇచ్చారు.  67వేల స్ర్టీట్​ లైట్లు, 85 విద్యుత్​ కార్యాలయాలు, 170 విద్యుత్​ సబ్​ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 

13, 830 రైళ్లు..
– మేళాకు వచ్చి వెళ్లేందుకు బుధవారం వరకు 13,830 రైళ్లు చేరుకున్నాయి. కేవలం రైల్వేల ద్వారా 30.20 కోట్ల మంది భక్తులు విచ్చేశారు. 50 నగరాల నుంచి నేరుగా ఈ రైళ్లు ప్రయాగ్​ రాజ్​ కు చేరుకున్నాయి. బుధవారం చివరి రోజు కావడంతో రోజువారీ 350 రైల్ల కంటే అదనంగా మరో 142 రైళ్లను నడిపారు. వీటి ద్వారా 6 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు వివరించారు. 

2800 విమానాలు, 650 చార్టెడ్​ జెట్​లు..
– 17 నగరాల నుంచి 30 నగరాల కనెక్టివిటీ ఉండేలా నేరుగా ప్రయాగ్​ రాజ్​ కు విమానాలను ఏర్పాటు చేశారు. బుధవారం వరకు 2800 విమానాలు ప్రయాగ్​ రాజ్​ కు వచ్చాయి. వీటిల్లో 4.5 లక్షల మంది భక్తులు ప్రయాణించారు. 650 చార్టెడ్​ జెట్​ లు కూడా ఈ ఏయిర్​ పోర్ట్​ కు వచ్చాయి. 

1.32 లక్షల కి.మీ. ప్రయాణించిన షటిల్​ బస్సులు..
–  ప్రయాగ్​ రాజ్​ కు వచ్చేందుకు యూపీ రోడ్​ వేస్​ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 1.32 లక్షల కి.మీ. ప్రయాణించాయి. 70 లక్షల మంది బస్సుల ద్వారా ప్రయాణించారు. నగరంలోపల 13 రూట్లలో 750 షటిల్​ సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రతీ రెండు నిమిషాలకు ఒక బస్సు నడిచాయి. వీటి ద్వారా 27 లక్షల మంది సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రతీరోజు 80 లక్షల వాహనాలు ప్రయాగ్​ రాజ్​ కు వచ్చాయి. 

50వేల మందితో భద్రత..
– 50వేల మంది భద్రతాధికారులను వినియోగించారు. 2700 కెమెరాలను ఏర్పాటు చేశారు. 56 పోలీస్​ స్టేషన్లు, 144 సబ్​ పోలీస్​ స్టేషన్లు, రెండు సైబర్​ పోలీస్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 50వేల మందిలో పోలీసులు, పీఎసీ, హోంగార్డులు, ఎస్టీఎఫ్​, ఎన్​ ఎస్జీ, సీఆర్పీఎఫ్​, బీఎస్​ ఎఫ్​, ఎయిర్​ ఫోర్స్​, ఆర్మీ భద్రతా సిబ్బంది ఉన్నారు. 2700 కెమెరాలతోపాటు వంద ఫేస్​ రికగ్నజేషన్​ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎఐ ఆధారిత 200 కెమెరాలు ఏర్పాటు చేశారు. 

20 ఫైర్​ స్టేషన్లు.. 351 ఫైరింజన్​ వాహనాలు..
– మంటలను అదుపు చేసేందుకు రెండువేల మంది అగ్నిమాపకశాఖ సిబ్బందిని నియమించారు. 351 ఫైరింజన్లు, 20 ఫైర్​ స్టేషన్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 700 బోట్లపై 3800 మంది ప్రత్యేక పోలీసులు గస్తీ విధులు నిర్వహించారు. 

43 ఆసుపత్రుల ద్వారా ఆరు లక్షల మందికి చికిత్స..
– మేళా ప్రాంతంలో 43 ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బుధవారం వరకు ఆరు లక్షల మందికి చికిత్సలందించారు. 125 ఎయిర్, రివర్​​ అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో 20 మంది గర్భీణులకు చికిత్స నందించారు. 20 మంది శిశువులు జన్మనిచ్చారు. 250 మందికి ఐసీయూలో చికిత్సనందించి వారి ప్రాణాలను కాపాడారు. 1.34 లక్షల మందికి ఉచిత కళ్లద్దాలను పంపినీ చేశారు. 1500మంది నేత్రదానానికి ముందుకు వచ్చారు. 

నాలుగు లక్షల డస్ట్​ బిన్​ ల ఏర్పాటు..
– 4 లక్షల డస్ట్​ బిన్​ లను ఏర్పాటు చేశారు. 11 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛత పనులను నిర్వహించారు. రోజుకు 600 మెట్రిక్​ టన్నుల చెత్తను తొలగించారు. 12–12 మందితో 800 టీమ్​ లను ఏర్పాటు చేశారు. 25 మీటర్లకు ఒక డస్ట్​ బిన్​ ను ఏర్పాటు చేశారు. గంగా–యమునా శుద్ధి కోసం 1500మంది ప్రత్యేక సిబ్బందిని, పర్యవేక్షకులను ఏర్పాటు చేశారు. వీరు ఎప్పటికప్పుడు నీటిలోని చెత్తా చెదారాన్ని తొలగించారు. 

పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ. 25వేల కోట్ల రాబడి.. రూ. 3 లక్షల కోట్ల రాబడి..
– మహాకుంభమేళా నిర్వహణకు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రూ. 7500 కోట్లను ఖర్చు చేశాయి. 3 లక్షల కోట్ల రాబడి సమకూరింది. 10 లక్షల మందికి ఉపాధి లభించింది. 8వేల తాత్కాలిక దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ. 44.98 కోట్ల లావాదేవీలు జరిగాయి. కుంభమేళాకు విచ్చేసిన ప్రతీ ఒక్క వ్యక్తి సగటున రూ. 5వేలు ఖర్చు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. మేళా నిర్వహణ ద్వారా యూపీ ప్రభుత్వానికి పన్నుల రూపేణా 25 వేల కోట్లు సమకూరింది. హోటల్లకు 40వేల కోట్లు, చిన్నపాటి ఆహార కొట్లు 20వేల కోట్లు, ప్రసాదాలు, దీపాలు, నూనెలు, అగర్​ బత్తులు, భక్తి పుస్తకాలు లాంటి దుకాణాల ద్వారా రూ. 20వేల కోట్లు, టూరిస్ట్​ గైడ్లు, ట్రావెల్​ ప్యాకేజీ రూ. 10వేల కోట్లు, ట్రాన్స్​ పోర్టేషన్​ రూ. 10వేల కోట్ల రాబడి సమకూరినట్లు అధికారులు వివరించారు. 

స్వచ్ఛతలోనూ రికార్డులు బద్దలే..
– 21 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు త్రివేణి సంగమంలోని ఘాట్లన్నింటినీ శుభ్రపరిచారు. దీంతో నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నారు. 329 మంది కార్మికులు గంగా యమునా నదుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి గిన్నిస్​ వరల్డ్​ రికార్డు దక్కించుకున్నారు. 24 ఫిబ్రవరిన 21 వేల మంది ఒకేసారి త్రివేణి సంగమ ఘాటన్నింటటినీ శుభ్రపరిచి మరోమారు రికార్డు దక్కించుకున్నారు. 25 ఫిబ్రవరి ఒకేసారి 550 షటిల్​ బస్సులను నడిపి రికార్డును సొంతం చేసుకున్నారు. పెద్ద కాన్వాస్​ పై ఒకేసారి పదివేల మందిచేతిముద్రలను తీసుకొని గిన్నిస్​ వరల్డ్​ రికార్డు నమోదు చేశారు.