కుంభమేళాకు 36మంది స్పాటర్లు

ఉగ్రవాదులను గుర్తించడమే పని

Jan 7, 2025 - 17:42
 0
కుంభమేళాకు 36మంది స్పాటర్లు

లక్నో: మహాకుంభమేళా నిర్వహణలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు అడుగులు వేశాయి. ఐదురాష్ర్టాల నుంచి ఉగ్రవాదులను గుర్తించే 36 మంది ప్రత్యేక అధికారుల (స్పాటర్ల)ను కుంభమేళా ప్రాంతానికి రప్పిస్తున్నారు. మంగళవారం వరకు 18 మంది అధికారులు యూపీకి చేరుకొని తమ పనిమొదలు పెట్టారు. వీరిని జమ్మూ-కశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఈశాన్య ప్రాంతాల నుంచి రప్పించారు. మరోవైపు కుంభమేళాకు దారితీయనున్న అన్ని రైల్వే ట్రాకుల పరిశీలనకు 500మంది ఆర్పీఎఫ్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​ ను నియమించారు. వీరంతా రాత్రి వేళలో రైల్వే ట్రాక్​ ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయనున్నారు. రైల్వే ట్రాక్​ పర్యవేక్షకులకు అదనంగా వీరిని నియమించారు. రైల్వే స్టేషన్లు, బస్​ స్టేషన్లు, జాతర జరగనున్న ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. స్పాటర్లు సుక్ష్మమైన నిఘా ద్వారా ఉగ్రవాదులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం చేరవేస్తారు. 
కాగా అకస్మాత్తుగా నలుగురు ఉగ్రవాదులు చొరబడితే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే రిహార్సల్స్ (మాక్​ డ్రిల్​)​ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రయాగ్​ రాజ్​ లోని సంగమ్​ ప్రాంతంలో ఉన్న హనుమాన్​ ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడి, ఆలయ పండితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఎస్​ఎస్​ జీ, ఏటీసీ దళాలు 27 నిమిషాల్లో ఆపరేషన్​ ను ముగించాయి. ఈ ఆపరేషన్​ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చగా, మరొకరిని సజీవంగా అరెస్ట్​ చేశారు.