క్వెట్టాలో బాంబు పేలుడు 26మంది మృతి

26 killed in bomb blast in Quetta

Nov 9, 2024 - 17:30
 0
క్వెట్టాలో బాంబు పేలుడు 26మంది మృతి
50మందికి తీవ్ర గాయాలు
బాధ్యత వహించిన బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ
ఇస్లామాబాద్​: పాకిస్థాన్​ లోని క్వెట్టా రైల్వే స్టేషన్​ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 14 మంది సైనికులతో సహా, 12 మంది పౌరులు మృతి చెందారు. 50మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం క్వెట్టా రైల్వే స్టేషన్​ నుంచి పెషావర్​ వెళ్లేందుకు రైలు సిద్ధంగా ఉండగా ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ రైలులో ఆర్మీకి చెందిన ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న సైనికులు వెళుతున్నారు. వీరినే టార్గెట్​ గా చేసుకున్న బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని రైల్వే సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ మహ్మద్​ బలోచ్​ మీడియాకు తెలిపారు. రైల్వే స్టేషన్​ లోని బుకింగ్​ కార్యాలయంలో పేలుడు సంభవించిందన్నారు. ఆ సమయంలో జాఫర్​ ఎక్స్​ ప్రెస్​ నిలిచి ఉందన్నారు. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. పేలుడుపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఆసుపత్రుల్లో గాయాలైనవారిని చేర్పించారు. బాంబు నిర్వీర్య దళం ఆధారాలను సేకరించే పనిలో పడింది. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ దాడి అనంతరం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తక్షణమే విచారణకు ఆదేశించారు. 
 
బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ..
 
1970లో ఈ ఉగ్ర సంస్థను స్థాపించారు. పాకిస్థాన్​, బ్రిటన్​, అమెరికాలో ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించి బహిష్కరించాయి. 1947–48 కాలం నుంచి పాక్​ లో భాగంగా ఉండబోమని బలూచిస్థాన్​ వాసులు ఆశించారు. తమకు స్వాతంత్ర్యం ఇచ్చి ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్నారు. ప్రత్యేక దేశమే డిమాండ్​ గా బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ పాక్​ లో దాడులకు పాల్పడుతోంది. భారత్​, ఇరాక్​, అప్ఘానిస్థాన్​, రష్యాలు బలూచ్​ ఆర్మీని సమర్థిస్తున్నాయని 1973లో జుల్ఫీకార్​ అలీ భుట్టో ఆరోపించారు. 
 
దాడులు..
 
ఫిబ్రవరి 5 డేరా ఇస్మాయిల్​ ఖాన్​ లో దాడి 10మంది పోలీసుల మృతి.
7 ఫిబ్రవరి క్వెట్టాలో దాడి 28 మంది మృతి.
20 మార్చిలో గ్వాదర్​ పోర్ట్​ పై దాడి 10 మంది మృతి.
26 మార్చి క్వెట్టాలో దాడి ఐదుగురు చైనీయుల మృతి.
26 ఆగస్ట్​ బలూచిస్థాన్​ లో దాడి 73 మంది మృతి.
11 అక్టోబర్​ బలూచిస్థాన్​ లో దాడి 21 మంది మృతి