శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని వలసదారుల కోసం ప్రత్యేకంగా 24 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను శనివారం విడుదల చేసింది. కాశ్మీర్, ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వలసదారులు నివసిస్తున్నట్లు గుర్తించింది. వీరందరిని ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో గతంలోలా గాకుండా ఈ కేంద్రాలు ఉదంపూర్, న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం గతంలో మాదిరిగా ఫారం ఎంను కూడా నింపాల్సిన అవసరం లేదని ఈసీ పేర్కొంది. జమ్మూ, ఉదంపూర్, ఢిల్లీలోని వివిధ సహాయక శిబిరాల్లో నివసిస్తున్న కాశ్మీరీ వలస ఓటర్లు ఈవీఎంల ద్వారా వ్యక్తిగతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. 24 పోలింగ్ కేంద్రాల్లో జమ్మూలో 19, ఉదంపూర్ లో 1, ఢిల్లీలో 4 పోలింగ్ కేంద్రాలున్నాయి. త్వరలోనే వలస ఓటర్లకు సంబంధించి ప్రత్యేక ముసాయిదాను అనుసంధానిస్తామని దాన్ని ప్రచురిస్తామని ఈసీ తెలిపింది.