కాశీ విశ్వనాథున్ని దర్శించుకున్న 10వేల నాగా సాధువులు
10 thousand Naga saints visited Kashi Vishwanath

వారణాసి: వారణాసిలో కాశీ విశ్వనాథున్ని దర్శించుకునేందుకు పదివేల మంది నాగసాధువులు అర్థరాత్రి నుంచే తరలివస్తున్నారు. బుధవారం ఉదయం రెండు లక్షలకు పైగా భక్తులతో ఆలయ ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల మేర భారీ క్యూలైన్ ఏర్పడింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు అఖాడాలకు చెందిన నాగసాధువులు చేతుల్లో త్రిశూలాలు, గదలు, పెద్ద పెత్త బళ్లెలాతో వస్తుండడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ వారి ఆశీర్వాదాలు పొందారు. ఆ ప్రాంతమంతా నాగసాధువులు చేస్తున్న హర హర మహాదేవ్ నామస్మరణతో మారుమ్రోగిపోయింది. జూనా అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవదేశానందగిరి కూడా సాధువులతోపాటు వచ్చి విశ్వనాథున్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున (రాత్రి) 2.15 నిమిషాలకు విశ్వనాథునికి ఆలయ వర్గాలు ప్రత్యేక హారతిని నిర్వహించారు. పవిత్ర శివలింగాన్ని అందంగా అలంకరించారు.
మహా కుంభమేళా చివరి రోజున మహా శివరాత్రి పర్వదినం రావడం అదృష్టమని పండితులు పేర్కొన్నారు. 2019లో కుంభమేళా సందర్భంగా 15 లక్షల మంది భక్తులు కాశీకి చేరుకొని విశ్వనాథున్ని దర్శించుకున్నారు. 2024 శివరాత్రి రోజు 11 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈసారి ఆ సంఖ్య 25లక్షలకు పైగా ఉంటుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.