ఘనంగా శివరాత్రి వేడుకలు
ప్రధాని, కేంద్రమంత్రుల శుభాకాంక్షలు

నా తెలంగాణ,సెంట్రల్ డెస్క్: దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం 12 జ్యోతిర్లింగాలతోపాటు అన్ని శైవక్షేత్రాల్లో వేకువజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందే అంచనా వేసిన ఆలయ వర్గాలు భారీ ఏర్పాట్లను చేశాయి. ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశాయి. పూలు, విద్యుద్దీపాలంకరణలతో ఆలయాలను ముస్తాబు చేశారు. ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దర్శనానికి విచ్చేసే, క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, ప్రసాదాల వితరణలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలున్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. లక్షలాది భక్తులతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శైవ క్షేత్రాలు హరహర మహాదేవ్, శంభో శివ శంభో నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశాల్లోని శైవక్షేత్రాల్లో కూడా ప్రత్యేక పూజలు, దర్శనాలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు మహాశివుని దర్శించుకొని తరిస్తున్నారు.
ప్రధాని, కేంద్రమంత్రుల శుభాకాంక్షలు..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ సింగ్, జి.కిషన్ రెడ్డిలు దేశ ప్రజలకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మహాశివుని చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. దేశ ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.