నాసిక్​ కుంభమేళా ఏర్పాట్లపై సీఎం పర్యవేక్షణ

CM supervision over Nashik Kumbh Mela arrangements

Feb 26, 2025 - 15:15
 0
నాసిక్​ కుంభమేళా ఏర్పాట్లపై సీఎం పర్యవేక్షణ

ముంబాయి: నాసిక్​ కుంభమేళా–2027 నిర్వహణపై మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ అధ్యక్షతన బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుంభమేళా నిర్వహణకు ఏర్పాట్లు, రోడ్లు, నీరు, విద్యుత్​, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, స్థలం లాంటి విషయాలపై అధికారులతో కలిసి ఆరా తీశారు. మేళా నిర్వహణకు సంబంధించి పూర్తి ప్రాజెక్ట్​ రిపోర్ట్​ ను సిద్ధం చేయాలని సూచించారు. భావించిన దానికంటే భక్తులు రెండింతలు వచ్చినా సౌకర్యాల ఏర్పాట్లలో కొదవ లేకుండా నివేదిక ఉండాలన్నారు. ప్రతీ 12 ఏళ్లకు ఒక్కసారి గోదావరి నది సంగమంలో స్నానాలు నమ్మకం, భక్తి, విశ్వాసాలతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి జాగ్రత్తగా రిపోర్టును ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ రూపొందించాలన్నారు. 2027లో నాసిక్​ కుంభమేళా నిర్వహించనున్నారు. ఇదివరకు 2015లో కుంభమేళాను నిర్వహించారు. అయితే సింద్​ దుర్గ్​ పర్యటనలో ఉన్నందున డిప్యూటీ సీఎం ఏక్​ నాథ్​ షిండే సమావేశానికి హాజరుకాలేదు. కాగా 300 కి.మీ. రోడ్లు, పార్కింగ్​ లు, రూ. 6 వేలకోట్లు ఖర్చు చేయాలని రాష్​ర్ట ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను సేకరించనుంది. 

కాగా గోదావరి నదిపై నాసిక్​ ప్రాంతంలో నిర్వహించే ఈ కుంభమేళాను విశేష చరిత్ర ఉంది. 17వ శతాబ్ధం నుంచి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పలు పుస్తకాల్లోనూ ఈ విషయాన్ని చరిత్రకారులు వివరించారు. ఈ నది ఒడ్డునే త్రయంబకేశ్వర్​ జ్యోతిర్లింగం ఉంది. పురాణాల ప్రకారం అమృతధారలు నాలుగు ప్రాంతాల్లో పడ్డాయి. అందులో నాసిక్​ కూడా ఒక ప్రాంతం కావడం విశేషం.