సీబీఎస్ఇ 10తరగతి రెండుసార్లు పరీక్ష?
CBSE 10th exam twice?

ముసాయిదా రూపకల్పనలో బోర్డు
అభిప్రాయ సేకరణ తరువాతే తుది నిర్ణయం
పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి నిర్ణయం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: సీబీఎస్ ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదో తరగతి విద్యార్థులకు శుభవార్త. వచ్చే ఏడాది 2026 నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలను రెండుసార్లు నిర్వహించనుంది. దీంతో తొలి పరీక్షలో అర్హత సాధించలేని విద్యార్థులకు తరువాతి పరీక్షలో అర్హత సాధించి పై తరగతులకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఒక విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకుండా కేంద్రం చర్యలు తీసుకుంటున్నారు. ముసాయిదాను బోర్డు ఆమోదించినట్లు సమాచారం. తొలుత విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం సేకరించాక ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
అనుమానాలు..
కాగా ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? మార్కులను ఎలా గణిస్తారు? సబ్జెక్టుకు ఎన్ని రోజుల సమయం ఇస్తారు?పరీక్ష రాశాక సబ్జెక్ట్ మార్చొచ్చా? తొలి పరీక్ష కంటే రెండో పరీక్షలో మార్కులు తక్కువగా వస్తే ఎలా? అనే అనుమానాలు, నిర్ణయాలపై సీబీఎస్ఇ బోర్డు విధివిధానాలను రూపొందించే పనిలో పడింది.
అందిన సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు తొలివిడత పరీక్షలు నిర్వహించనున్నారు. రెండోసారి మే 5 నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ విధంగా ఒకేసారి 32 రోజుల్లో పరీక్షలను విద్యార్థులు రాయొచ్చు. పేపర్ కు పేపర్ కు మధ్య ఒకటి లేదా రెండు రోజుల సమయం మాత్రమే కేటాయిస్తారు. ఈ విధానం ద్వారా అంతరం ఐదు రోజులకు పెరగనుంది. అయితే పాఠ్యపుస్తకాల్లోని సిలబస్ ను పరీక్షలు నిర్వహించేలోగా పూర్తి చేయాలని సంకల్పించారు. అంటే రెండుసార్లు సిలబస్ ను పూర్తి చేయాలని బోర్డు అధికారులు లక్ష్యంగా పెటుకున్నారు. అయితే 2026 సెప్టెంబర్ నాటికే విద్యార్థులు ఒకే పరీక్షలో హాజరవుతారా? రెండు పరీక్షలు రాయదలచుకున్నారా? అనేది రిజిస్ర్టేషన్లపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలోనే సబ్జెక్ట్ లాంటి వివరాలను విద్యార్థులు నిర్ణయించుకోవచ్చు. ఆ తరువాత మార్పులకు వీలు కాదు.
తొలి పరీక్షలో ఎదైనా సబ్జెక్ట్ లో ఎక్కువ, తక్కువ మార్కులు వస్తే తరువాతీ పరీక్షల్లో మీరు రాయాలనుకున్న సబ్జెక్టులను మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు రెండుసార్లు అన్ని పేపర్లను రాస్తే ఎక్కువగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఫలితాలను డిజిలాకర్ లో భద్రపరుస్తారు. రెండో పరీక్ష తరువాతే ఫలితాలను ప్రకటిస్తారు. విద్యార్థుల్లో కోచింగ్ తరగతుల అవసరాన్ని, మూల్యాంకన వ్యవస్థ, హానికరమైన ప్రభావాలు, పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.