ప్రధానితో సీఎం భేటీ టన్నెల్ ప్రమాదంపై మోదీ ఆరా
Modi asked about the tunnel accident in the CM's meeting with the Prime Minister

పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వినతి
విభజన సమస్యలూ పరిష్కరించండి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం న్యూ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు విషయాలపై చర్చలు జరిగాయి. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. కేంద్రం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మూసీ ప్రక్షాళన, జాతీయ రహదారులకు కేటాయింపులు, ఇతర ప్రాజెక్టులకు విరివిగా నిధులు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. విభజన చట్టంలోని పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
మెట్రో లైన్ ఫేస్ 2, ఎయిర్‌పోర్ట్ వరకు పొడిగింపునకు ఆర్థిక సహాయం, అనుమతులు, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ తదితర విషయాలపై గంటపాటు చర్చించారు. సీఎం రేవంత్ తోపాటు ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డిలున్నారు.