సింగిల్ గానే 17 స్థానాల్లో పోటీ
నేడే ఢిల్లీలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు, ప్రచారంపై కార్యాచరణ ప్రణాళిక సమావేశం
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు డూప్ ఫైటింగ్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని 17 సీట్లలో సింగిల్ గానే రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో కుటుంబ, అవినీతి పాలన మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీరాలు పలికిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ కాళేశ్వరం అవినీతిపై కమీషన్లను అందుకుంటూ సొమ్ము చేసుకుంటుందని విమర్శించారు. ఈ లెక్కన ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజం, సంక్షేమంపై పూటకోమాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ప్రచారంపై బీజేపీ పార్టీ కార్యాచరణ రూపొందించేందుకు రాష్ర్ట ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహిస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
దోపిడీ, సెటిల్మెంట్లే ఆ రెండు పార్టీ విధానాలు..
వందరోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సెటిల్మెంట్లకు పాల్పడుతోందని ఆరోపించారు. రియల్, కాంట్రాక్టర్లు, బిల్డర్లను బెదిరించి వసూళ్లకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడితే,ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దోపిడీ ప్రారంభించిందని మండిపడ్డారు. కర్ణాటకలో కూడా ఇదే విధంగా పాల్పడి తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టారన్నారు. తెలంగాణలో దోచుకున్న డబ్బంతా దేశమంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే యోచనలో కాంగ్రెస్ ఉందని మండిపడ్డారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీకి రాహుల్ గాంధీ సరితూగే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో ఏర్పడబోయేది మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని, తెలంగాణలో కూడా ప్రజల ఆశీస్సులు తమ పార్టీకి ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.