కొనసాగుతున్న ఇద్దరు కార్మికుల అన్వేషణ
50 మందిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ బృందాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలీలో జరిగిన మంచుకొండచరియల ప్రమాదంలో ఆదివారం వరకు ఆరుగురు మృతి చెందారు, మరో ఇద్దరు కార్మికుల కోసం అన్వేషణ కొనసాగుతుందని రక్షణ శాఖ అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ మనీష్ శ్రీవాస్తవ ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ మూడో రోజు కూడా కార్మికులను వెతికేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 50 మంది కార్మికులను కాపాడామన్నారు. ఒకరు ఇంటికి వెళ్లినట్లు గుర్తించామన్నారు. మరో నలుగురు కార్మికుల్లో ఆదివారం ఇద్దరి మృతదేహాలను వెలికితీశామన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. హిమపాతం సంభవించినప్పుడు ఓ కంటైనర్ కొట్టుకుపోయిందని తెలిపారు. కాగా గాయాలైన కార్మికుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ అంతా అకస్మాత్తుగా జరిగిందని చెప్పారు. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయిందన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న కంటైనర్లన్నీ ధ్వంసమయ్యాయని తాను మంచులో కూరుకుపోయినా రెస్క్యూ బృందాలు తనను రక్షించాయని వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆచూకీ లభించని ఇద్దరి కోసం డిఫెన్స్ ఆధ్వర్యంలో ఆబ్జెక్ట్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా శోధిస్తున్నట్లు శ్రీవాస్తవ్ తెలిపారు.