రక్షణ రంగం మరింత బలోపేతం
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

పలు దేశాలతో కీలక ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు: అన్ని దేశాలతో రక్షణ శాఖ బంధాలు మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏరో ఇండియా 2025 జింబాబ్వే, యెమెన్, ఇథియోపియా, గాంబియా, గాబన్‌లతో బుధవారం మూడోరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం చర్చల సారాంశాన్ని రక్షణ శాఖ ప్రకటించింది. వరుస సమావేశాల్లో రక్షణ, సైనిక, సామర్థ్య ప్రయత్నాలను పెంపొందించడంపై ఫలప్రదమైన చర్చలు నిర్వహించారు.
జింబాబ్వే రక్షణ మంత్రి ఒప్పా ముచింఉరి కాశిరితో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారం పెంపొందడంపై కుదిరిన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఇథియోపియా రక్షణ మంత్రి ఐషా మహమ్మద్ సాయుధ దళాలకు సైనిక శిక్షణ, శాంతి పరిరక్షణ, సామర్థ్య నిర్మాణం వంటి రంగాలపై ఒప్పందాలు కుదిరాయి. యెమెన్ రక్షణ మంత్రి మొహ్సేన్ మహ్మ్ హుస్సేన్ అల్ దైరితో జరిగిన ఒప్పందాలు కూడా రక్షణ శాఖకు సంబంధించినవే. గాంబియా రక్షణ మంత్రి సెరింగ్ మోడౌ ఎన్జీతో జరిగిన చర్చల్లో రక్షణ సామర్థ్యాలలో నూతన పద్ధతుల మార్పిడి వంటి అంశాలపై పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గాబోనీస్ రక్షణ మంత్రి బ్రిగిట్టే ఒంకనోవాతో జిగిన సమావేశంలో సైనిక సామర్థ్యం పెంపుదల, రక్షణ, పరిశ్రమ రంగాలలో అవకాశాలపై పలు ఒప్పందాలు కుదిరాయి.