దళాలను పెంచుకుంటున్న రష్యా
Russia is building up troops

యూరోపియన్ దేశాలకు ముప్పు
మ్యూనిచ్ భద్రతా కాన్ఫరెన్స్ లో జెలెన్ స్కీ
మ్యూనిచ్: తన సాయుధ దళాలకు మరో 1.50 లక్షల మంది సైనిక సంపత్తి పెంచుకొని ఉక్రెయిన్ ను నాశనం చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఆదివారం జర్మనీ మ్యూనిచ్ భద్రతా కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ పరిణామాలు యూరోపియన్ దేశాలను కూడా ఆందోళన కలిగించేవిగా అభివర్ణించారు. రష్యాకు కౌంటర్ గా యూరోపియన్ దేశాలు కూడా తమ సైనిక శక్తిని పెంపొందించుకునే అవసరం ఉందన్నారు. ఉమ్మడిగా సైన్యాన్ని సృష్టించుకుంటే సత్ఫలితాలు సాధిస్తామన్నారు. యూరప్ సమస్యల పరిష్కారానికి అమెరికా నో చెప్పే అవకాశం ఉందని, ఇది యూరప్ దేశాల భద్రతకు ముప్పుగా పరిణమించొచ్చన్నారు. ఈ వేసవిలో రష్యా యూరప్ ను లక్ష్యంగా చేసుకునేందుకు సిద్ధమవుతుందని ఇంటలిజెన్స్ సమాచారం తమ వద్ద ఉందని జెలెన్ స్కీ పేర్కొన్నారు. కీలక సమయంలో యూరప్ దేశాలు ఐక్యమై ఉమ్మడి రక్షణ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా జెలెన్ స్కీ చెప్పిన అంశాలను ధృవీకరించిన సమాచారం లేదని నాటో సైనిక కమిటీ చైర్మన్ అడ్మిరల్ గియుసెప్పే అన్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరికకు అమెరికా నో చెప్పడంతోనే జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలకు తెరతీసినట్లుగా పలువురు నిపుణులు సమావేశంలో భావించారు.