ప్రతీకారం తప్పదు
యూనస్ కు హసీనా హెచ్చరిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ ను ఉగ్రవాద దేశంగా మార్చారని ఇందుకు ప్రతీకారం తప్పదని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా తాత్కాలిక ప్రధాని యూనస్ ను హెచ్చరించారు. శాంతియుతంగా ఉన్న దేశాన్ని చక్కదిద్దాల్సింది పోయి ఉగ్రవాదులతో కలిసి మరింత అగ్గికి ఆజ్యం పోశారని మండిపడ్డారు. మంగళవారం హసీనా మీడియాతో మాట్లాడారు. బంగ్లాకు ప్రస్తుతం ప్రపంచదేశాలు చేయూతనిచ్చే పరిస్థితుల్లో లేదని, ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇదంతా యూనస్ కుట్రేనన్నారు. అల్లా దయ వల్ల తాను బతికి బయటపడ్డానని, మరోమారు బంగ్లాలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లేలా చేస్తానని, తిరిగి వస్తానని చెప్పుకొచ్చారు. ఎంతోమంది మహిళలపై హింస జరిగిందని, వితంతువులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. నోబెల్ గ్రహీత బంగ్లాను ఉగ్రదేశంగా మార్చారని వాపోయారు. బాధిత కుటుంబాలకు సహాయం చేస్తానని, హంతకులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతానని అన్నారు. పోలీసులను చంపకుండా విప్లవం సాధ్యం కాదని, ఎంతోంది పోలీసులను సైతం చంపిన ఒక విద్యార్థి ఉగ్ర నాయకుడికి యూనస్ మంత్రి వర్గంలో చోటు కల్పించడం శోచనీయమన్నారు. అరాచకత్వాన్ని అంతం చేయకుంటే బంగ్లాదేశ్ అంధకారంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు.