అమెరికాలో మోదీకి రెడ్​ కార్పెట్​ స్వాగతం

Red carpet welcome to Modi in America

Feb 13, 2025 - 12:50
 0
అమెరికాలో మోదీకి రెడ్​ కార్పెట్​ స్వాగతం

వాషింగ్టన్​: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత కాలమాన ప్రకారం గురువారం వేకువజామున 4.30 గంటలకు అమెరికాకు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అధికారికంగా రెడ్​ కార్పెట్​ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. సీఐఎ, ఎన్​ ఎస్​ఎ, సహా 18 నిఘా సంస్థలకు ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి గబ్బర్డ్ నియామకాన్ని అమెరికా పార్లమెంట్ ఎగువ సభ ఆమోదించింది. ప్రధాని గబ్బర్డ్​ కు శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ భద్రత, కొత్తగా తలెత్తే ముప్పులపై పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు చర్చించారు.

మోడీ ప్రతినిధి బృందం ఆరు సమావేశాలలో హాజరుకానుంది. మోదీ,  ట్రంప్​ మధ్య సమావేశం భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి (శుక్రవారం తెల్లవారుజామున) 2.30 గంటల ప్రాంతంలో 45 నిమిషాలపాటు కొనసాగనుంది. 14 వేకువజాము 3.40 గంటలకు వైట్​ హౌస్​ లో మీడియాతో కూడా సంభాషించనున్నారు. అనంతరం ట్రంప్​ ఏర్పాటు చేసే విందులో ప్రధాని మోదీ సహా ఇరుదేశాల మంత్రులు, విదేశాంగ శాఖాధికారులు, ప్రతినిధులు పాల్గొంటారు. వాతావరణం, భద్రత, వ్యాపార, వాణిజ్య, రక్షణ రంగాలు, ఎఐ సాంకేతికత, సుంకాలు, రెడ్​ కార్నర్​ నోటీసు జారీ చేసిన నిందితుల అప్పగింత, అక్రమ వలసలపై ఇరువురి మధ్య చర్చలు జరగనున్నాయి. కాగా ప్రధాని మోదీ అమెరికా చేరుకున్న తరువాత ఆయనకు ప్రముఖ బ్లెయిర్​ హౌస్​ లో బస కల్పించారు. ఈ నివాసానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. నాలుగు అంతస్థులు గల ఈ బ్లెయిర్​ హౌస్​ లో 119 గదులు, 14 బెడ్‌రూమ్‌లు 70వేల చ.అ. విశాల ప్రాంగణంలో నిర్మించారు.