దివాళా దిశలో పాక్

భారత్​తో దోస్తీకి కొత్త సర్కారు ప్రయత్నం షరీఫ్​ మంత్రివర్గంలో సమాలోచనలు ఉగ్రవాదం వదలందే దోస్తీ ఎలా: భారత్

Mar 24, 2024 - 17:34
 0
దివాళా దిశలో పాక్

నా తెలంగాణ, న్యూఢిల్లీ: భారత్​తో వాణిజ్య, వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని పాక్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి పాక్​ ఆర్థిక వ్యవస్థ దివాళా దిశలో నడుస్తున్న సంగతి తెలిసిందే. 2019లో భారత్​లో వాణిజ్య, వ్యాపార సంబంధాలను పాక్​ తెగదెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఎలాగైనా భారత్​తో చేతులు కలపాలని భావిస్తోంది. ఈ విషయాల్లో పాక్​మంత్రివర్గం తీవ్ర సమాలోచనల్లో ఉందని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ చెప్పారు. బ్రస్సెల్స్‌లో జరిగే అణుశక్తి సదస్సులో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న ఆయన, అక్కడ భారత్‌ తో సంబంధాలపై మాట్లాడటం విశేషం. జమ్మూకశ్మీర్​ విషయంలో మాటిమాటికి తలదూర్చడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, సైనికులు, ప్రజలపై దాడులు, ఆర్టికల్​ 370 రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో పాక్​భారత్​తో దౌత్యసంబంధాలను తగ్గించామని పాక్​ మంత్రి పేర్కొన్నారు.

పాక్​ పొరుగు దేశం దురదృష్టకరం.. జై శంకర్​

ఇదే విషయంపై శనివారం భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ సింగపూర్​ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్​తన పొరుగు దేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నదని, కానీ ఉగ్రదేశంగా ముద్రపడ్డా కూడా పాక్​ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. భారత్​కు పాకిస్తాన్ పొరుగుదేశం కావడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటూ.. ముందు ఒకలా, వెనక మరోలా వ్యవహరిస్తున్న దేశంతో ఇక చర్చలు కొనసాగిద్దాం అని భారత్​ ఎన్నటికీ అనబోధని జై శంకర్​ స్పష్టం చేశారు. 

షరీఫ్​కు మోదీ అభినందనలు, మోదీకి ధన్యవాదాలు..

పాక్​లో ఇటీవలే నూతన ప్రభుత్వం ఏర్పాటైంది.  ప్రధానిగా షెహబాజ్​ షరీఫ్ ​ఎన్నికయ్యారు. షరీఫ్​ ఎన్నికపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దీనికి ప్రతిగా షరీఫ్​ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో భారత్​తో కలిసి దౌత్యసంబంధాలను మెరుగు పరుచుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

చైనాతో దోస్తీ.. పాక్​పై వ్యతిరేకత..

ఓవైపు పాక్​లో చైనా చేపట్టిన పలు పనులకు బలూచ్ ​ఉగ్రవాదులు తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నారు. తాలిబన్లు కూడా పాక్​ చర్యలపై గుర్రుగానే ఉన్నారు. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా భారత్​ వైపు నుంచి నిలిచిపోవడంతో క్రమేణా పాక్​లో సంక్షోభ పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. అయినా పాక్​ తన పెడధోరణిని విడనాడక, మొండిపట్టుతో భారత్​ను సాధించాలని చైనాకు స్నేహ హస్తం అందిస్తూ మరింత అగాధంలోకి కూరుకుపోతోంది. ఇటీవల ఏర్పడ్డ షరీఫ్​ ప్రభుత్వం ఆయా విషయాలను తన మంత్రివర్గంలో కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో భారత్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచ దేసాలు వేచి చూస్తున్నాయి.