ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో రూ. 22 వేల కోట్లు
On February 24, in the farmers' accounts, Rs. 22 thousand crores

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత రూ. 22 వేల కోట్ల నిధులు జమకానున్నాయని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. 9.80 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమకానుందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రధాని ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఈ పథకంతో చిన్న రైతుల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాల అవసరాలు తీరుస్తూ ఉత్పత్తిని పెంచడంలో గణనీయంగా దోహదపడుతుందన్నారు. బిహార్ వేదికగా ఈ నిధులను ప్రధాని విడుదల చేయనున్నారని స్పష్టం చేశారు. గతంలో 9.60 కోట్లు లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య కాస్త ఈసారి 9.80 కోట్లకు పెరిగిందన్నారు. కేంద్రం ఇప్పటివరకూ రూ. 3.86 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసిందన్నారు. ప్రపంచంలోనే ఇంతపెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న దేశం భారత్ ఒక్కటేనని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.