అధికారిక లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు
ప్రముఖుల నివాళులు
ముంబాయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబాయిలోని బ్రీచ్ క్రాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా కన్నుమూసినట్లు టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
రతన్ టాటా మృతిపట్ల వ్యాపార, రాజకీయ, సినీ అన్ని రంగాల ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది. రతన టాటా భౌతికకాయాన్ని ఉదయం 10 గంటలకు సందర్శనార్థం ముంబాయిలోని ఎన్ సీపీఏ మైదానంలో సందర్శనార్థం ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు సాయంత్రం అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది.
అనన్య బిర్లా..
దూరదృష్టి గల రతన్ టాటా కోల్పోవడం బాధకరం. ఆయన పనితీరు, కష్టపడేతత్వం, క్రమశిక్షణతోనే ఇంత గొప్పవాడిగా నిలచారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతామని ఆశించారు.
ప్రధాని మోదీ సంతాపం..
రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారు. మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారు. ఆయన దేశానికి చేసిన ఎనలేనివి. ఆయనలోని దాతృత్వం ప్రపంచదేశాల్లో కూడా భారత్ కీర్తి పతాకాలను చాటిచెప్పేలా ఉంది.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..
తరాల తరబడి స్ఫూర్తి నింపిన ఓ అమూల్యమైన రత్నాన్ని భారత్ కోల్పోయింది. భారత పారిశ్రామిక దిగ్గజం, సామాజికవేత్త, పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా ఇక భౌతికంగా మనమధ్య లేకపోవడం తీవ్ర విచారకరం. పరిశ్రమలతోపాటుగా టెక్నాలజీ, ఆటోమొబైల్, విద్యుదుత్పత్తి తదితర రంగాల్లో టాటా కంపెనీల విస్తరణతోపాటు.. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన మహానీయుడు. ఈయన స్పృశించని భారతీయ కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. నిరంతరం సృజనాత్మకతకు, ఆధునిక విధానాలకు పెద్దపీట వేశారు. దేశ పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలిచిన మహనీయుడు. భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యరంగానికి ఓ ఆదర్శమూర్తి. భారతీయ కంపెనీలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు టాటా చేసిన ప్రయత్నం చిరస్మరణీయం. వారి నిరాడంబరమైన జీవితం, సమాజాభివృద్ధి దిశగా చేసిన ప్రయాణం.. భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. అలాంటి మహనీయుని అస్తమయం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా..
టాటా మరణం దేశానికి తీరని లోటు. కేవలం కార్పొరేట్ ఇండియాకే కాదు యావత్ దేశానికి ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారు. వ్యాపారంలోనే గాక అన్ని రంగాల్లోనూ ఆయన చేసిన సేవలు ఎనలేనివి. దేశంలోని అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకునే వ్యాపరదక్షత ప్రదర్శించేవారు. ఎక్కడా వెనక్కు తగ్గలేదు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్
140 కోట్ల మంది భారతీయులు, ప్రపంచం మొత్తం ఆయనను ప్రేమిస్తున్నారు. మేము గడిపిన క్షణాలు మరిచిపోలేను. ఆయనతో అల్పాహారం తీసుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయి. రతన్ టాటా జ్ఞాపకాలు తనలో ఎన్నటికీ నిలిచిపోతాయి. ఆయన లేని లోటు తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
ప్రముఖుల నివాళులు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్ కె. అడ్వాణీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జి.కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, NCP వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, శరద్ పవార్, సుప్రియా సూలే, కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ
రతన్ టాటా ఆప్యాయత, దాతృత్వం, సేవా, దయాగుణాలు ఎంతో గొప్పవి. ఆయన చివరిసారిగా తనకు భారతరత్న వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. ఫిబ్రవరిలో చివరిసారిగా ఆయనతో మాట్లాడారు. ఆయన మృతితో విచారకరం.
ఎంపీ సుధామూర్తి..
ఎంతో సహనశీలురు, ప్రజల పట్ల ఆయన ఎంతో కరుణతో ఉండేవారు. ఆయన మరణించడం తనకు వ్యక్తిగతంగా లోటుగా అనిపిస్తోంది.
సుందర్ పిచాయ్..
గొప్పదార్శనికుడిని కోల్పోయాం. భారత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం.
యూఎస్ఐబీసీ అధ్యక్షుడు అతుల్ కేశప్..
దాతృత్వానికి ఒక రూల్ మోడల్ రతన్ టాటా. ఆయన్ను కోల్పోవడం భారత్ ఒక గొప్ప కుమారుడిని కోల్పోయినట్లుగా భావిస్తున్నాను.
న్యూయార్క్ టైమ్స్..
ప్రపంచమంతా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన మహానీయుడు, రతన్ టాటా అంటే ఒక గొప్ప బ్రాండ్ అనే దిశగా వ్యాపారాన్ని మలచగలిగారు.
కేంద్రమంత్రి అమిత్ షా..
"భారతదేశ అభివృద్ధికి రతన్ టాటా తన జీవితాన్ని నిస్వార్థంగా అంకితం చేశారు. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ దేశం, ప్రజల అభ్యున్నతిపై ఆయన చూపించే నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచేది. ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, మనందరి హృదయాలలో ఎప్పటికీ జీవించే ఉంటారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్ టాటా. ఆయన మరణవార్త విని ఎంతో బాధపడ్డాను. మూడు దశాబ్దాలుగా ఆయనతో వ్యక్తిగత, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. తన వ్యాపార చతురతకు అతీతంగా సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేసిన సామాజిక నాయకుడు.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ..
భారత్ ఒక వ్యాపార దిగ్గజాన్ని, ఆధునిక మార్గాన్ని పునర్నిర్మించిన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. కరుణ కలిగిన వ్యక్తి. ఆయన లాంటి లెజండ్‌కు మరణం లేదు. ప్రజలలో ఆయన ఎన్నటికీ జీవించే ఉంటారు.
ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా ..
రతన్ టాటా నైతికతలోను, నాయకత్వంలోను, దాతృత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన జ్ఞాపకాలు మనతో ఎప్పటికీ ఉంటాయి.
- ఆనంద్ మహీంద్రా..
రతన్ టాటా దేశానికి ఎనలేని సేవలందించారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
సినీ ప్రముఖులు..
బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, ఏఆర్ రెహమాన్, ప్రియాంక చోప్రా, టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి, జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రాజమౌళి, ఖుష్బూ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ..
భారతదేశ ముద్దుబిడ్డను కోల్పోయాం. వ్యాపారం, దాతృత్వంలో చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్‌నకు ‘ఎక్స్’లో సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే..
కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన ఈరోజు భౌతికంగా మనమధ్య లేకపోవడం తీవ్ర విచారకరం. దేశ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.