చర్చలకు కట్టుబడి ఉండాలి
ఈజిప్ట్, ఖతార్ అధికారులకు హమాస్ విజ్ఞప్తి

గాజాసిటీ: కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావాలని తాము కోరుకోవడం లేదని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల హెచ్చరిక నేపథ్యంలో హమాస్ అభిప్రాయాన్ని వెల్లడించింది. యుద్ధ విరమణ ఒప్పందంలో భాగంగా శనివారం మరో ముగ్గురు బందీలను విడుదల చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ నిబంధనలను ఉల్లంఘించినందున విడుదలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ప్రతిష్ఠంభనను తొలగించేందుకు హమాస్ గాజా చీఫ్ ఖలీల్ ఈజిప్టు భద్రతాధికారులను కలిశారు. తిరిగి యుద్ధం జరగకుండా చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ఇరుదేశాలు చర్చలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఆపేందుకు ఈజిప్ట్, ఖతార్ అధికారులు కీలకభూమిక పోషించారు. ఇజ్రాయెల్ బందీల్లో 30 మంది వరకు మృతి చెంది ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ బందీలను ఒకేసారి విడుదల చేయాలని పట్టుబట్టింది. ఒకవేళ అలా జరగకుండా గాజాలో దాడులు ప్రారంభించే అవకాశం ఉంది.